తడిసిన వడ్లు.. రాలిన మామిడి

తడిసిన వడ్లు.. రాలిన మామిడి


మెదక్, సంగారెడ్డి,   వెలుగు: ఉమ్మడి మెదక్​ జిల్లాలో  అకాల వర్షం బీభత్సం  చేసింది. వడ్లకుప్పలు తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలుచోట్ల మంగళవారం భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు వీయడంతో కరెంట్​ స్తంభాలు, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో కరెంట్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల వడగళ్లు పడ్డాయి. కొనుగోలు కేంద్రాల వద్ద , మార్కెట్​ యార్డుల్లో వడ్లు తడిసిపోయాయి.  మెదక్​ పట్టణంలో అరగంటసేపు వడగళ్లతో కుండపోత వర్షం కురిసింది.

రామాయంపేట దగ్గర ఈదురుగాలులకు చెట్టుకూలి బైక్​పై పడడంతో  కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం భాగీర్తిపల్లికి   చెందిన నీళ్ళ పద్మ (38) చనిపోయింది.  అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్  కు గాయాలయ్యాయి.  బలమైన ఈదురు గాలులు వీయడంతో మిషన్​ కాంపౌండ్​, కోర్టు, ఇందిరా కాలనీలో నాలుగు కరెంట్​స్థంబాలు నేలకూలాయి. దీంతో కరెంట్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఓల్డ్​ బస్టాండ్​ సమీపంలో ఓ ఇంటి పిట్టగోడ కూలి పడటంతో పక్కనే ఉన్న బైండ్ల నాగరాజు ఇంటి పైకప్పు కూలిపోయింది. వ్యవసాయ మార్కెట్​ యార్డులో భారీ వర్షానికి వడ్లు తడిసిపోయాయి.

రామాయంపేట మండలంలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది.  పలుచోట్ల వడగళ్లు పడ్డాయి. పొలాల్లో వడ్లు నేలరాలిపోగా, రోడ్లపై ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యింది. నిజాంపేట మండలం కేంద్రంలో ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి. చల్మెడలో మామిడి కాయలు రాలిపోయాయి. పాపన్నపేట మండలంలో ఈదురు గాలులకు మెదక్​ - బొడ్మట్​పల్లి రూట్​లో,  ఏడుపాయల కమాన్​ వద్ద చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దౌలాపూర్​లో కుర్మ మొగులయ్య ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి.  

లింగాయిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం జలమయం అయ్యింది. హవేలి ఘనపూర్​ మండలం జక్కన్నపేటలో వడగళ్లు పడ్డాయి.  చిన్న శంకరంపేట మండలం టి.మాందాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి సిద్ధయ్య ఇంటిపై కప్పు రేకులు గాలి దుమారానికి ఎగిరిపోగా, ఇంట్లోని ధాన్యం, బట్టలు   వర్షానికి తడిసి ముద్దయ్యాయి.   కౌడిపల్లి మండలంలో   రైతులు నిల్వచేసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయి.

 సంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల మంగళవారం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో పాటు  అక్కడక్కడ వడగళ్ల వర్షం పడింది. సంగారెడ్డి టౌన్ లో గంటకు పైగా వర్షం కురవగా, కొండాపూర్, సదాశివపేట, కంది, కంగ్టి, నారాయణఖేడ్ మండలాల్లో వడగళ్ల వాన కురిసింది.  కోహీర్ నుంచి బిలాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ గ్రామం మీదుగా తాండూర్ రోడ్డుపై కరెంట్ స్తంభాలు పడి వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కంగ్టి మండలం ఎడ్ల రేగాడి తండాలో పిడుగు పడి ఎద్దు, ఒక ఆవు చనిపోగా, జమ్గి(కే) గ్రామంలో గౌతమి అనే మహిళ పిడుగుపాటుకు  సృహ తప్పి పడిపోయింది. ఆమెను   బాన్సువాడ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. సంగారెడ్డి ఫల పరిశోధన శాలలో    వర్షానికి  మామిడికాయలు నేలరాలాయి.

 సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా   ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురుస్తుంది.  వడగళ్ల వర్షంతో జిల్లాలలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు గ్రామాల్లో టెన్నిస్ బాల్ సైజులో వడగండ్లు.  జిల్లాలోని సిద్దిపేట దుబ్బాక మిరుదొడ్డి, తొగుట, నారాయణరావుపేట, చేర్యాల, జగదేవ్​పూర్ మండలాలతో పాటు ఇతర ప్రాంతాల్లో భారీ గాలులతో రాత్రి వర్షం ప్రారంభమైంది. పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోగా పంట పొలాల్లో వరి గింజలు రాలిపోయాయి.  మామిడి కాయలు సైతం భారీగా నేలరాలాయి.------------