
రామాయంపేట, నిజాంపేట, వెలుగు: జిల్లాలో పలుచోట్ల బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రామాయంపేట మండలం రాయిలాపూర్ లో కుండపోత వాన పడగా కొనుగోలు కేంద్రం జలమయం అయింది. తాడెం నర్సింలు అనే రైతుకు చెందిన వడ్లు వరదలో కొట్టుకుపోయాయి. మండలంలోని వివిధ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో సైతం ధాన్యం తడిసిపోయింది. నిజాంపేటలో భారీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. మెదక్ పట్టణంలో, కొల్చారం మండలంలోని వివిధ గ్రామాల్లో భారీ వర్షం కురిసింది.
సిద్దిపేట: సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్ల పరిధిలోని భారీ వర్షం కురిసింది. 4.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గజ్వేల్ పట్టణంలో రెండు గంటల పాటు కురిసిన వర్షంతో ప్రధాన రోడ్డు జలమయమైంది. సిద్దిపేట పట్టణంలో ప్రధాన మార్గం లో వరద నీటితో నిండిపోయింది. జిల్లాలోని హుస్నాబాద్, బెజ్జంకి, చేర్యాల, దుబ్బాక, మిరుదొడ్డి ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసిపోయాయి. కోహెడ మండలం బస్వాపూర్ లో మంగళ వారం రాత్రి పిడుగు పడి ఆవు మృతి చెందింది.