నలుగురు జవాన్ల కుటుంబాలకు చెరో రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా

నలుగురు జవాన్ల కుటుంబాలకు చెరో రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా

సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 16 మంది జవాన్లకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాళులర్పించారు. ఈ ఘటనలో చనిపోయిన జవాన్లలో నలుగురు యూపీకి చెందినవారున్నారు.  దీంతో వారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని  సీఎం  యోగి ప్రకటించారు.  అంతేకాకుండా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. వారి జిల్లాల్లోని రోడ్లకు వారి పేర్లు పెడతామని ప్రకటించారు.  ఈ మేరకు సీఎంవో నుండి జీవో రిలీజ్ అయింది. చనిపోయిన జవాన్ల పేర్లు  లోకేష్ కుమార్, శ్యామ్ సింగ్ యాదవ్, భూపేంద్ర సింగ్, చరణ్ సింగ్ ఉన్నారు. జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన యోగి.. మృతులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. 

ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలోని  జెమాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్మీకి చెందిన ముగ్గురు జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు (జేసీఓలు) సహా 16 మంది ఆర్మీ సిబ్బంది మరణించారు. జెమా ప్రాంతంలోని మూలమలుపు వద్ద కాలువలోకి అర్మీ వాహనం  పడిపోయింది.   ఇక ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున  ఆర్థిక సాయం అందజేస్తామని పీఎం మోడీ ప్రకటించారు.