
- జడ్జిమెంట్‌తో ఎమ్మెల్యే పదవి కోల్పోనున్న ఉత్తరప్రదేశ్ నేత
వారణాసి: బాలికపై రేప్ కేసులో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్ ను ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. 2014లో 15 ఏండ్ల బాలికపై అత్యాచారం కేసును విచారించిన సోన్‌భద్ర జిల్లా ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు.. పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎమ్మెల్యేను దోషిగా తేల్చింది. 8 మంది ప్రాసిక్యూషన్, ముగ్గురు డిఫెన్స్ సాక్షులను విచారించిన తర్వాత జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. ఈ నెల 15న వెల్లడించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే గోండ్‌కు ఏడేండ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడే చాన్స్ ఉంది. దీంతో ఆయన పదవి కోల్పోనున్నారు.
పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారం..
సోన్‌భద్ర జిల్లా మైయోర్‌పూర్ గ్రామానికి చెందిన 15 ఏండ్ల బాలికపై రాందులర్ గోండ్ 2014 పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన అన్నయ్యకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేశారు.