వరుడు రెండో ఎక్కం చెప్పలేదని పెళ్లి ఆపేసిన వధువు

వరుడు రెండో ఎక్కం చెప్పలేదని పెళ్లి ఆపేసిన వధువు

కాసేపట్లో పెళ్లి. పెళ్లి మండపం అంతా బంధువులతో నిండిపోయింది. ఇరు కుటుంబాలు, బంధువలు సంతోషంగా పెళ్లి వేడుకను వీక్షిస్తున్నారు. వధువు, వరుడు దండలు మార్చుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ, అంతలోనే ఏమైందో ఏమో.. నాకు ఈ పెళ్లి ఇష్టంలేదంటూ పెళ్లి కూతురు పెళ్లి పీఠల మీద నుంచి లేచింది. దాంతో ఆ పెళ్లి  కాస్తా ఆగిపోయింది. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు పెళ్లి ఆగిపోయింది?

యూపీలోని మహోబా జిల్లాలోని ధవార్ గ్రామానికి చెందిన యువకుడికి.. పక్క ఊరికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. దాంతో ఇరుకుటుంబాలు అంగరంగవైభవంగా పెళ్లి వేడుకను జరిపిస్తున్నాయి. కాసేపట్లో దండలు మార్చుకుంటారనుకుంటుండగా.. వరుడిని రెండో ఎక్కం చెప్పాలని వధువు అడిగింది. అందుకు ఆ వరుడు తడబడ్డాడు. దాంతో కనీసం ఎక్కాలు కూడా చెప్పలేని వ్యక్తిని తాను పెళ్లి చేసుకోనని యువతి తెగేసి చెప్పింది. దాంతో వధువు బంధువులు, స్నేహితులు ఆమెను పెళ్లికి ఒప్పించడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ వధువు మాత్రం ఎంతో చదువుకున్న తాను.. ఎక్కాలు కూడా రాని వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి మండపం నుంచి బయటకు వచ్చేసింది. 

అయితే వరుడి కుటుంబం చదువు విషయంలో తమను మోసం చేసిందని వధువు బంధువులు అన్నారు. వరుడి కుటుంబం మమ్మల్ని మోసం చేయాలని చూసింది. వరుడు స్కూల్‌కు కూడా వెళ్లనట్లు తెలుస్తోంది. సమాజానికి భయపడకుండా నా సోదరి వివాహం వద్దని చెప్పింది’ అని వధువు సోదరుడు తెలిపాడు.  

వధువు పెళ్లి వద్దనేసరికి వరుడి కుటుంబం పన్వారీ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ విషయంపై స్టేషన్ హౌస్ ఆఫీసర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ‘గ్రామ పెద్దల జోక్యంతో ఇరు కుటుంబాలు రాజీపడ్డాయి. దాంతో మేం ఎటువంటి కేసు నమోదు చేయలేదు. పెద్దల ఒప్పందం ప్రకారం వధూవరుల కుటుంబాలు బహుమతులు మరియు ఆభరణాలను తిరిగి ఇవ్వడానికి అంగీకరించారు’ అని ఆయన తెలిపారు.