భారీ వర్షాలకు కుప్పకూలిన పోలీస్ స్టేషన్.. ఎస్సై మృతి

భారీ వర్షాలకు కుప్పకూలిన పోలీస్ స్టేషన్..  ఎస్సై మృతి

ఢిల్లీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఒకవైపు గాలులు, మరో వైపు ఉరుములు మెరుపులతో కూడిన వానలతో ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. శనివారం (మే 25) రాత్రి కురిసిన వానలకు చెట్లు, ఇండ్లు కూలిపోయాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతం, ఢిల్లీ శివారు ప్రాంతం ఘజియాబాద్ లో పోలీస్ స్టేషన్ కుప్పకూలింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు స్టేషన్ కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకుని ఎస్సై మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. 

ఏసీపీ అంకుర్ విహార్ ఆఫీస్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వీరేంద్ర మిశ్రా (58) స్టేషన్ కూలిన ఘటనల దుర్మరణం చెందారు. స్టేషన్ పైకప్పు కూలి ఒక్కసారిగా కూలిపోవడంతో చనిపోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. 

అత్యంత వేగంగా గాలులు వీస్తుండటంతో పైకప్పు కూలి పడినట్లు అధికారులు చెప్పారు. వర్షం కారణంగా స్టేషన్ లోనే ఉండిపోయిన ఎస్సై.. పైకప్పు మీద కూలి ఊపిరాడక, తీవ్ర గాయాలతో అక్కడిక్కడే చనిపోయినట్లు తెలలిపారు. 

వాతావరణ శాఖ చెప్పిన వివరాల ప్రకారం రాజధానిలో 82 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచాయి. దీంతో చెట్లు కూలిపడటంతో పలు చోట్ల కరెంటు వైర్లు తెగిపడ్డాయి. కొన్ని ఏరియాల్లో కరెంటు సప్లై నిలిచిపోయింది. రాత్రంతా కురిసిన వర్షానికి ఢిల్లీ జలమయం అయ్యింది.

శనివారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5.30 వరకు 81.2 మిల్లీ మీటర్ల భారీ వర్షానికి ఢిల్లీలో కొన్ని ఏరియాలు నీట మునిగాయి. మోతీ బాగ్, మింటో రోడ్, ఢిల్లీ కంటోన్ మెంట్, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ మార్గ్ ప్రాంతాలు జలమయమయ్యాయి. 

బలమైన ఈదురుగాలులు, వర్షాల కారణంగా ఢిల్లీలో రవాణా స్థంభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 100కు పైగా విమానాలు రద్దు చేశారు. రాత్రి 11.30 నుంచి ఉదయం 4 గంటల ప్రాంతంలో 49 విమానాలను దారిమళ్లించారు ఎయిర్ పోర్ట్ అధికారులు.