యూపీలో గెలిస్తే 20 లక్షల కొలువులిస్తం

యూపీలో గెలిస్తే 20 లక్షల కొలువులిస్తం
  •     కరోనా బాధిత ఫ్యామిలీలకు రూ. 25 వేలు 
  •     యూపీలో కాంగ్రెస్ థర్డ్ మేనిఫెస్టో రిలీజ్ చేసిన ప్రియాంక

లక్నో:  ఉత్తరప్రదేశ్​లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, రైతులకు పది రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ప్రకటించారు. బుధవారం లక్నోలో కాంగ్రెస్ థర్డ్ మేనిఫెస్టో ‘ఉన్నతి విధాన్’ను ఆమె రిలీజ్ చేశారు. పశువుల వల్ల పంటలు నాశనమైతే సంబంధిత రైతులకు రూ. 3 వేల నష్ట పరిహారం కూడా ఇస్తామని ప్రకటించారు. గోధన్ న్యాయ్ యోజన కింద ఆవు పెండను కిలో రూ. 2 చొప్పున కొంటామన్నారు. గోధుమలు, వడ్లను క్వింటాలుకు రూ. 2,500 చెల్లించి కొంటామని, చెరకు క్వింటాలుకు రూ. 400 ఇస్తామన్నారు.

అలాగే రైతులకు కరోనా ప్యాండెమిక్ టైంలోని కరెంట్ బిల్లులను రద్దు చేస్తామని, మిగతా రోజుల్లోని బిల్లులను సగం మాఫీ చేస్తామన్నారు. కరోనాతో తీవ్రంగా ఎఫెక్ట్ అయిన కుటుంబాలకు రూ. 25 వేల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ఇక నిరుద్యోగ సమస్యను నివారించేందుకు ఖాళీగా ఉన్న12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, కొత్తగా మరో 8 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ విధానానికి ముగింపు పలుకుతామని, ఇప్పుడున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను దశలవారీగా రెగ్యులరైజ్ చేస్తామన్నారు. కాగా, యూపీ ఎన్నికలకు కాంగ్రెస్ నుంచి ఇదివరకే మహిళల కోసం ‘శక్తి విధాన్’, యూత్ కోసం ‘భారతి విధాన్’ పేరుతో రెండు మేనిఫెస్టోలను ప్రియాంక రిలీజ్ చేశారు.