
ఇంజనీరింగ్ చదవలేదు. అయితేనేం, తనకు ఎదురైన సమస్య నుంచే సమాధానం వెతుక్కున్నాడు. సొంతంగా పరికరాన్ని తయారుచేసి తనకొచ్చిన సమస్యను పరిష్కరించుకున్నాడు. అందరితో ‘వారెవ్వా’ అనిపించుకున్నాడు. ఒక సామాన్యుడి ఆలోచనతో కొత్త మార్పులు తీసుకు రావచ్చని నిరూపించిన లల్లూ రామ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తర్ ప్రదేశ్, లఖీంపూర్‌లో ఉంటాడు 77 ఏండ్ల లల్లూరామ్. వీధులన్నీ తిరుగుతూ పూలు అమ్ముతుంటాడు. లల్లూ రామ్, అతని భార్య బతికేది ఆ సంపాదనతోనే. అయితే, ఎండలో ఎక్కువసేపు తిరిగి పూలు అమ్మడం వల్ల లల్లూ రామ్ ఎక్కువసార్లు అనారోగ్యానికి గురయ్యేవాడు. దాంతో వ్యాపారం సరిగ్గా నడిచేది కాదు. దాచుకున్న కొంత డబ్బు మందులకు ఖర్చయ్యేది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించాడు లల్లూ రామ్. ‘హెల్మెట్‌కి ఫ్యాన్ పెట్టుకుంటే బెటర్’ అనిపించింది. అలా అనిపించడం ఆలస్యం వర్క్ సేఫ్టీ హెల్మెట్, బ్యాటరీ, తక్కువ ఓల్టేజ్‌ని ప్రొడ్యూస్ చేసే సోలార్ ప్లేట్ కొనుక్కున్నాడు. వాటిని హెల్మెట్‌కి అమర్చాడు. తరువాత చిన్న ఫ్యాన్‌ని ముఖానికి గాలి తాకేలా హెల్మెట్ ముందు ఫిక్స్ చేశాడు. దీనికున్న ఆన్ ఆఫ్ బటన్‌తో కావాల్సినప్పుడు ఫ్యాన్ వాడుతుంటాడు లల్లూరామ్. ‘ఈ ఆలోచనతో ఎండనుంచి కొంత రిలీఫ్ దొరుకుతుంది.
ఎండ ఎంత ఎక్కువుంటే ఫ్యాన్ అంత ఫాస్ట్‌గా తిరుగుతుంది. నీడలో తిరగడం ఆగిపోతుంద’ని చెప్తున్నాడు లల్లూరామ్. ‘తలమీద ఏదో వింతగా ఉందే? అదేంటో చూద్దామ’ని చాలామంది లల్లూరామ్ దగ్గరికి వస్తున్నారు. అలా వచ్చిన వాళ్లంతా కొన్ని పూలు కొనుక్కొని వెళ్తున్నారు. ‘ఇదివరకటి కంటే ఇప్పుడు గిరాకీ కాస్త పెరిగింది. అందరూ వచ్చి నాతో ఫొటోలు తీసుకొని వెళ్తున్నారు’ అని చెప్పాడు లల్లూరామ్. ‘ఈ ఆలోచన బాగుంది. నీ ఆలోచనతో సూర్యునికే చెమటలు పుట్టిస్తున్నావ’ని ఈ వీడియో చూసినోళ్లంతా కామెంట్స్ చేస్తున్నారు.