పాక్ గెలుపుతో భార్య సంబరాలు.. పోలీసులకు భర్త ఫిర్యాదు

పాక్ గెలుపుతో భార్య సంబరాలు.. పోలీసులకు భర్త ఫిర్యాదు

భారత్ -పాకిస్తాన్ మ్యాచ్ అంటే... చాలు క్రికెట్ అభిమానులే కాదు.. సామాన్య జనం సైతం టీవీలకు అతుక్కుపోతారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఆసక్తిగా చూస్తారు. టీమిండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఉన్న ఇంట్రస్ట్ మరే మ్యాచ్‌‌పై ఉండదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇటీవలే టీట్వంటీ వరల్డ్ కప్‌లో భాగంగా పాక్-టీమిండియా మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ భారత్‌పై విజయం సాధించింది. అయితే పాక్ విజయంతో తన భార్య సంబరాలు చేసుకుందంటూ ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసుల్ని కోరాడు.ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

గత నెల అక్టోబరు 24న భారత్​-పాకిస్థాన్​ మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్​ మ్యాచ్​లో భారత్​పై పాక్​ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో యూపీలోని రామ్‌పుర్‌‌లోని అజీమ్ నగర్‌కు చెందిన ఇషాన్ మియాన్ అనే వ్యక్తి తన భార్య రాబియా షమ్సీపై పోలీసులు కంప్లైంట్ చేశాడు. పాక్ గెలుపును ఎంజాయ్ చేస్తూ తన భార్య సంబరాలు చేసుకుందని ఆరోపించాడు. అంతే కాదు వాట్సాప్‌లో స్టేటస్ కూడా పెట్టిందన్నాడు. ఆమె కుటుంబ సభ్యులు కూడా పాక్ గెలుపును క్రాకర్స్ కాల్చుతూ సెలబ్రేట్ చేసుకున్నారని ఆరోపించాడు. 

తన భార్యపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. భారత్​పై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిందని ఆరోపించాడు.రబియా స్టేటస్​ ఆధారంగా పోలీసులు సెక్షన్​ 153ఏ, 66 కింద కేసు నమోదు చేశారు. నిందితురాలిని త్వరలోనే అరెస్ట్​ చేస్తామని పోలీసులు తెలిపారు. అయితే  పెళ్లైన దగ్గర్నుంచి రాబియా, ఇషాన్ వేరువేరుగానే ఉంటున్నారు.రాబియా భర్త ఇషాన్‌పై వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టినట్లు సమాచారం.