సైకిల్ పై వారం రోజుల్లో 850 కి.మీ. ప్రయాణం

సైకిల్ పై వారం రోజుల్లో 850 కి.మీ. ప్రయాణం
  • పెళ్లి కోసం యూపీలో ఓ యువకుడి తాపత్రయం
  • సొంతూరికి వెళ్లేలోపే క్వారంటైన్ కు తరలించిన అధికారులు

బలరాంపూర్ (ఉత్తరప్రదేశ్): తన పెళ్లికి ముహూర్తం దగ్గర పడుతుండటంతో ఓ సైకిల్ పై సొంతూరికి బయలుదేరాడు. ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి వారం రోజుల్లో 850 కిలోమీటర్లు ప్రయాణించాడు. తన గమ్యానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉండగానే అధికారులు అడ్డుకున్నారు. క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలోని పిప్రా రసూల్ పూర్ కు చెందిన 24 ఏళ్ల సౌనూ కుమార్ చౌహాన్ పంజాబ్ లోని లూధియానాలో టైల్స్ కంపెనీలో పని చేసేవాడు. ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. ఇంతలో లాక్ డౌన్ ప్రకటించడంతో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ నిలిపివేశారు. పెళ్లి ముహూర్తం దగ్గరపడతుండటంతో సైకిల్ పై సొంతూరికి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ముగ్గురు ఫ్రెండ్స్ కూడా తోడయ్యారు. రాత్రింబవళ్లు సైకిల్ తొక్కి వారం రోజుల్లో 850 కిలోమీటర్లు ప్రయాణించి బలరాంపూర్ చేరుకున్నారు. చెక్ పోస్ట్ దగ్గర ఆపిన అధికారులు సోనూ కుమార్, ఫ్రెండ్స్ ను క్వారంటైన్ సెంటర్ కు తరలించారు.”మా ఊరు ఇక్కడి నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెళ్లి చేసుకునేందుకు ఇంటికి వెళ్తున్నాని చెప్పినా అధికారులు పర్మిషన్ ఇయ్యట్లేదు” సోనూ కుమార్ చెప్పాడు. అయితే 14 రోజుల తర్వాత కరోనా టెస్టులో నెగెటివ్ వస్తేనే ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తామని బలరాంపూర్ ఎస్పీ దేవరంజన్ వర్మ అన్నారు.