26 ఏళ్ల తర్వాత దొరికిన హంతకుడు

26 ఏళ్ల తర్వాత దొరికిన హంతకుడు

మీరట్: హత్య కేసులో నిందితుడిని ఉత్తరప్రదేశ్​ పోలీసులు 26 ఏండ్ల తర్వాత అరెస్ట్ చేశారు. నిందితుడు షానవాజ్ అలీ మరో 13 కేసుల్లో మోస్ట్ వాంటెడ్​గా ఉన్నాడని షహరాన్ పూర్ ఎస్పీ రాజేశ్ కుమార్ ఆదివారం మీడియాకు చెప్పారు. యూపీలోని షహరాన్​పూర్ జిల్లాకు చెందిన షానవాజ్ 1991లో తన సహాయకుడైన అహ్మద్​ అలీని చంపేశాడు. విచారణ తర్వాత కోర్టు అతడికి జీవితఖైదు విధించింది. నాలుగేండ్లపాటు షానవాజ్ జైలు శిక్ష అనుభవించాడు. అదే ఏడాదిలో కండిషన్లతో కూడిన బెయిల్ మీద బయటికి వచ్చి కన్పించకుండా పోయాడని ఎస్పీ తెలిపారు. దీంతో నిందితుడిపై పోలీసులు నాన్​బెయిలబుల్ వారెంట్ తో సహా పట్టించినవారికి రూ.25 వేల రివార్డు ప్రకటించారు. ‘‘షానవాజ్ కాశ్మీర్​లో ఉంటున్నాడని సమాచారం అందింది. అక్కడ ఓ లోకల్ మార్కెట్​లో సాక్సులు, స్కార్ఫ్​లు అమ్ముకుంటూ బతుకుతున్నాడని తెలిసింది. స్పెషల్ టీమ్స్ ద్వారా షానవాజ్​ను శుక్రవారం అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాం. జ్యుడీషిల్ కస్టడీకి తరలించాం”అని ఎస్పీ కుమార్ చెప్పారు.