రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ.. సెక్షన్ 144 విధింపు

రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ.. సెక్షన్ 144 విధింపు

అయోధ్యలోని రామ మందిర 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుక, రాబోయే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ పోలీసులు శాంతియుత వేడుకలను నిర్ధారించడానికి సిద్ధమయ్యారు. లక్నో, నోయిడా, గ్రేటర్ నోయిడాలో సీఆర్పీసీ(CrPC) చట్టంలోని సెక్షన్ 144 విధించారు. గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీసులు జారీ చేసిన ఆర్డర్‌లో పేర్కొన్న విధంగా 5 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల చట్టవిరుద్ధమైన సమావేశాలు, అనధికార ఊరేగింపులు, ప్రదర్శనలను నిర్వహించరాదు.

జనవరి 22న శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం జరగనుందని, ఆ తర్వాత జనవరి 25న దివంగత హజ్రత్ అలీ జయంతి, జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయని అదనపు డీసీపీ (లా అండ్ ఆర్డర్) హృదేశ్ కతేరియా తెలిపారు. వీటితో పాటు, వివిధ సంస్థలు, రైతులు ఎప్పటికప్పుడు కొన్ని నిరసనలు, ప్రదర్శనలు ప్రతిపాదించారన్నారాయన. సంఘవ్యతిరేకుల ద్వారా శాంతికి విఘాతం కలగవచ్చని ఊహించి, ఈ కార్యక్రమాలను సురక్షితంగా నిర్వహించేలా సరైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరాన్ని విస్మరించలేమని కతేరియా పేర్కొన్నారు.