'ఉపా' రద్దు చేయాలె.. పార్టీలు తమ మేనిఫెస్టోల్లో పెట్టాలి : సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

'ఉపా' రద్దు చేయాలె.. పార్టీలు తమ మేనిఫెస్టోల్లో పెట్టాలి : సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

హైదరాబాద్, వెలుగు: చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)ను రద్దు చేయాలని, తాడ్వాయిలో152 మందిపై నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని సీపీఐ నిర్వహించిన రౌండ్​టేబుల్​ సమావేశం డిమాండ్​ చేసింది. మంగళవారం సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మగ్దూం భవన్​లో ఈ సమావేశం జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఉద్యమకారులు, ప్రశ్నించేవారిపైన, అంతర్జాతీయ టెర్రరిస్టులపైన ఒకే రకం చట్టాలు ప్రయోగిస్తారా అని ప్రశ్నించారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీలు తాము అధికారంలోనికి వస్తే రాష్ట్రంలో ‘ఉపా’ అమలు చేయబోమని స్పష్టమైన హామీఇవ్వాలని డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ..  ‘ఉపా’కు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పునాదులు వేస్తే, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్తున్నదని విమర్శించారు. ‘ఉపా’కు వ్యతిరేకంగా జులై 15న సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కళాకారులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రజాగాయకురాలు విమలక్క తెలిపారు. సమావేశంలో పోటు రంగారావు, సాధినేని వెంకటేశ్వర్​రావు, చాడవెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.