
ఆదిలాబాద్, వెలుగు: తెలంగాణలో ఉపాధి హామీ పథకం ఉద్యోగులు ఏపీలో ‘ఉపాధి’ ఉద్యోగుల కంటే పదివేల రూపాయలకుపైగా తక్కువ జీతం వస్తోందని ఆవేదన చెందుతున్నారు. విభజనకు ముందు అందరికీ ఒకేలా వేతనాలు ఉండేవని… రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అలవెన్సులను సరిగా చెల్లించకపోవడంతోనే ఇంత భారీ తేడా వచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలంలో ఓవర్ టైమ్ అలవెన్స్‌లు, సెల్‌ఫోన్ బిల్లులు ఇవ్వడంలో కూడా తేడాలున్నాయి. దీనిపై ఇప్పటికే మంత్రులకు కలిసి విన్నవించుకున్నా జీతాల్లోతేడాలు సరిచేసే దిశగా ఎలాంటి చర్యలు చేపడుతున్న సూచనలేవి కనిపంచడం లేదు.v
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3,579 మంది ఉద్యోగులు ఉపాధి హామీ డపథకం కింద పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్ కన్సల్టెన్స్(ఈసీ), అడిషనల్ ప్రోగ్రాం ఆఫీసర్(ఏపీవో), టెక్నికల్ అసిస్టెంట్(టీఏ), కంప్యూటర్ ఆపరేటర్(సీవో) తోపాటు ప్లాంటేషన్ మేనేజర్/హార్టికల్చర్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్ తదితర ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు. 2016 వరకు తెలుగు రాష్ట్రాల ఉద్యోగుల వేతనాలు దాదాపు సమానంగానే ఉన్నప్పటికీ, ఆ తరువాత ఓవర్టైం అలవెన్స్, వేజ్ అలవెన్స్, ఇతర ఇంక్రిమెంట్లలో తేడా వల్ల ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల్లో పెరుగుదల ఏపీలో కంటే తక్కువగా ఉంది. ఇందులో కూడా కంప్యూటర్ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగుల వేతనాల్లో భారీగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
అలెవెన్స్‌లు ఇవ్వడంలో జాప్యం
ఏపీతో పోలిస్తే తెలంగాణలో అలెవెన్స్‌లు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓవర్టైం అలవెన్స్లతోపాటు, వేజ్ అలవెన్స్‌లు ఎప్పటికప్పుడు ఇవ్వడంతోనే అక్కడ వేతనాలు పెరిగిన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ వేసవికాలం ఎండలో ఓవర్టైం చేసినా డబ్బులు ఇవ్వడంలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గతంలో సీయూజీ సిమ్ కార్డు కింద నెలకు రూ.300 ఇచ్చేవారని, తక్కువగా మాట్లాడిన సందర్భాల్లో మిగిలిన డబ్బులు వాపస్ ఇచ్చేవారని, ఇపుడు అవికూడా ఇవ్వడంలేదని ఉద్యోగులు వాపోతున్నారు.