భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరో మైలురాయిని సాధించింది. UPI ప్లాట్‌ఫాం రూ.1.02 లక్షల కోట్ల విలువైన చెల్లింపులను చూసింది.ఇది అత్యధిక సింగిల్-డే లెక్కింపుగా గుర్తింపు పొందింది. అక్టోబర్ 18 న దంతేరస్ సందర్భంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్లాట్‌ఫాం రూ.1.02 లక్షల కోట్ల విలువైన 754 మిలియన్ లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ఇది ప్రారంభం నుంచి ఒకే రోజులో జరిగిన అత్యధిక లావాదేవీగా రికార్డు సృష్టించింది. భారత్ లో పెరుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ,ఆన్‌లైన్ చెల్లింపులకు ఇదొక ఉదాహరణ. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ప్రకటించారు.
UPI ప్లాట్‌ఫాం లక్షలాది మంది భారతీయులకు - చిన్న వ్యాపారులనుంచి పెద్ద సంస్థల వరకు - నిరంతరాయంగా తక్షణ డిజిటల్ చెల్లింపులను రోజువారీ జీవితంలో ఒక భాగంగా చేస్తూ వారికి సాధికారత కల్పిస్తుంది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన UPI మొబైల్ ఫోన్లను ఉపయోగించి బ్యాంక్ ఖాతాల మధ్య తక్షణ బదిలీలను చేస్తోంది. డిజిటల్ ఇండియా లో భాగంగా ఫిన్‌టెక్ కంపెనీలు ,బ్యాంకులతో భాగస్వామ్యం ఏర్పరుచుకొని UPI లావాదేవీలను పెద్ద ఎత్తున వృద్ధిని సాధించింది. డిజిటల్ లావాదేవీల పెరుగుదల నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు భారత వేగంగా సాగుతోందని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు.
UPI లైట్ , UPI పై క్రెడిట్ ,సింగపూర్ ,UAE వంటి దేశాలలో అంతర్జాతీయ UPI కనెక్టివిటీ వంటి కొత్త ఆవిష్కరణల ద్వారా UPI రోజువారీ లావాదేవీ వాల్యూమ్‌లు, విలువలు పెరుగుతూనే ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
