డిసెంబరులో UPI రికార్డుల మోత: వరుసగా 6 రోజులు 70 కోట్లకుపైగా ట్రాన్సాక్షన్స్..

డిసెంబరులో UPI రికార్డుల మోత: వరుసగా 6 రోజులు 70 కోట్లకుపైగా ట్రాన్సాక్షన్స్..

దేశంలో చెల్లింపుల రూపురేఖలను పూర్తిగా మార్చేసింది యూపీఐ పేమెంట్స్ వ్యవస్థ. ఇంటర్నెట్ సేవల లభ్యత మారుమూల గ్రామాలకు కూడా చేరువ కావటంతో.. కోట్ల మంది భారతీయులు చిన్న చెల్లింపులకు సైతం భౌతిక కరెన్సీ వాడకానికి బదులుగా డిజిటల్ పేమెంట్స్ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం డబ్బు దాచుకోవటానికి లేదా దూరంలో ఉన్న ప్రజలకు డబ్బు పంపటానికి మాత్రమే పరిమితమైన బ్యాంకింగ్ సంస్థ ఇప్పుడు రోజువారీ జీవితంలో అత్యవసరమైన సర్వీసుగా మార్చేసింది యూపీఐ పేమెంట్స్. 

మోస్ట్ పాపులర్ అయిన యూపీఐ పేమెంట్స్ ఇతర పేమెంట్ సాధనాల కంటే ఎక్కువగా ఉన్నట్లు తాజా డేటా చెబుతోంది. డిసెంబర్ నెలలో మెుదటి ఆరు రోజుల పాటు ప్రతి రోజూ 70 కోట్లకు పైగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ దేశంలో జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ డేటా వెల్లడించింది. అలాగే ఈనెల మెుదటి ఐదు రోజుల్లో లక్ష కోట్లకు పైగా విలువైన చెల్లింపులు యూపీఐ ద్వారానే జరిగినట్లు తెలుస్తోంది. దీనికి ముందుగా ఈ ఏడాది ఆగస్టు 2న తొలిసారిగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ సంఖ్య రోజుకు 70 కోట్ల చెల్లింపుల రికార్డును నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

అయితే భారత ప్రభుత్వం యూపీఐ ద్వారా రోజుకు 100 కోట్ల ట్రాన్సాక్షన్స్ చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న దూకుడు స్థాయి కొనసాగితే వచ్చే ఏడాదే ఈ టార్గెట్ అచీవ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో చెల్లింపుల ఫిన్ టెక్ కంపెనీలు దీని వెనుక కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, నావీ, క్రెడ్, సూపర్ మనీ వంటి స్టార్టప్ కంపెనీలు చెల్లింపుల ఆటను పూర్తిగా మార్చేస్తున్నాయి దేశంలో. 

యూపీఐ చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు లేనందున ఫిన్ టెక్ కంపెనీలు రూపే క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ద్వారా ఎండిఆర్ రూపంలో ఆదాయం పొందుతూ.. వీటిని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఎక్కువ మెుత్తం యూపీఐ డబ్బు చెల్లింపులకు మర్చంట్ డిస్కౌంట్ ఛార్జీలను అమలు చేయాలని కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం దీనిని నిరాకరిస్తోంది. ప్రైస్ సెన్సిటివ్ ఇండియన్స్ ఇలాంటి చర్యల వల్ల తిరిగి భౌతిక కరెన్సీ వినియోగానికి షిఫ్ట్ అవుతారనే భయాలు కూడా ప్రభుత్వాన్ని ఛార్జీల అంగీకారానికి నిరాకరించేలా చేస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.