ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై బదిలీ వేటు

ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై బదిలీ వేటు
  • కేసులో నిందితుడు, హెచ్‌‌సీఏ సెక్రటరీ దేవరాజ్‌‌ పరారీ

హైదరాబాద్‌‌, వెలుగు: హెచ్‌‌సీఏ వ్యవహారంలో ఉప్పల్ పీఎస్ ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ ఎలక్షన్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. సీఐడీ కేసులో నిందితుడైన హెచ్‌‌సీఏ సెక్రటరీ దేవరాజుకు ముందుస్తు సమాచారం అందించాడని రాచకొండ సీపీ ఆఫీస్‌‌కు అతన్ని అటాచ్‌‌ చేశారు. ఈ మేరకు సీపీ సుధీర్‌‌‌‌బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్‌‌సీఏపై సీఐడీ నమోదు చేసిన కేసు వివరాలు సహా నిందితుల అరెస్ట్‌‌, ఇతర రహస్యాలను దేవరాజుకు ఎప్పటికప్పుడు అందించాడని తెలిసింది. 

ఎలక్షన్ రెడ్డి అందించిన సమాచారంతోనే  సీఐడీకి చిక్కకుండా దేవరాజు తప్పించుకున్నాడని విచారణలో వెలుగు చూసింది. కాగా, హెచ్‌‌సీఏ అధ్యక్షుడు జగన్‌‌ మోహన్ రావు సహా ఐదుగురు నిందితులను సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ మేరకు స్పెషల్‌‌ బ్రాంచ్‌‌ నివేదిక ఆధారంగా ఎలక్షన్ రెడ్డిపై సీపీ చర్యలు తీసుకున్నారు. మరోవైపు దేవరాజు అరెస్టుకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేశారు. రెండు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.