సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాలు విడుదల

సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాలు విడుదల

సివిల్స్ మెయిన్స్‌ 2025 ఫలితాలు బుధవారం యూపీఎస్సీ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2,736 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. ఇందులో తెలంగాణ నుంచి సుమారు 80 మంది ఉన్నారు. 

న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు:  యూనియన్‌‌‌‌ పబ్లిక్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ మెయిన్స్‌‌‌‌-2025 ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా 2,736 మంది అభ్యర్థులు పర్సనాలిటీ టెస్ట్‌‌‌‌ (ఇంటర్వ్యూ) రౌండ్‌‌‌‌కు అర్హత సాధించినట్లు యూపీఎస్సీ వెల్లడించింది. ఇందులో తెలంగాణ నుంచి సుమారు 80 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు ఎంపిక కాగా, వీరిలో 43 మంది రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఆర్థిక చేయూత పొందిన వారు ఉండటం విశేషం. దేశవ్యాప్తంగా ఆగస్టు 22 నుంచి 31 వరకు సివిల్స్‌‌‌‌ మెయిన్ ఎగ్జామ్స్‌‌‌‌ జరిగాయి. ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల రూల్‌‌‌‌ నంబర్లు, పేర్లతో కూడిన లిస్ట్‌‌‌‌ను యూపీఎస్సీ తన అధికారిక వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో అప్ లోడ్ చేసింది. 

సింగరేణి సహకారంతోనే..: బలరామ్‌‌‌‌

సింగరేణి కార్పొరేషన్ ప్రారంభించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఆర్థిక సహాయం అందుకున్న తెలంగాణ అభ్యర్థుల్లో 43 మంది సివిల్స్‌‌‌‌ ఇంటర్వ్యూలకు ఎంపికైనట్టు సింగరేణి సీఎండీ బలరాం నాయక్ తెలిపారు. సింగరేణి సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఆర్థిక యువత కలలను సాకారం చేయడానికి ఈ పథకాన్ని ప్రారంభించినట్టు వెల్లడించారు. 

ఈ ఏడాది ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన 202 మందికి రూ.లక్ష ఆర్థిక సాయం చేయగా, వారిలో 43 మంది ఇంటర్వ్యూలకు ఎంపికవ్వడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. రాష్ట్రంలోని సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారుల నేతృత్వంలో మాక్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఢిల్లీలో ఇంటర్వ్యూలకు వెళ్లే అభ్యర్థులకు వసతి సౌకర్యం కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు. 

సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి అభినందనలు.. 

రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులను సీఎం రేవంత్ అభినందించారు. సివిల్స్‌‌‌‌కు ప్రిపేర్‌‌‌‌‌‌‌‌ అయ్యే పేద అభ్యర్థులకు ఆర్థిక సహాయాన్ని అందించేందకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ సివిల్స్ అభయహస్తం స్కీమ్‌‌‌‌ను గతేడాది ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా సివిల్స్ మెయిన్స్‌‌‌‌కు ప్రిపేర్ అవుతున్న 202 మంది అభ్యర్థులకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో.. రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. 

బుధవారం విడుదలైన సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో ఈ పథకం కింద సాయం పొందిన అభ్యర్థుల్లో 43 మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. వీరికి గతేడాదిలాగే, ఇంటర్వ్యూ ప్రిపేరేషన్ కోసం మరో రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం వెల్లడించారు.