
యూరేనియం వెలికితీత వ్యతిరేక జేఏసీ కన్వీనర్ కె.నాసరయ్య
యురేనియం తవ్వకాల పేరుతో పాలకులు దశాబ్ధకాలంగా నల్లమల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా అరిగోసపెడుతున్నరని నల్లమల యురేనియం తవ్వకాల వ్యతిరేక జేఏసీ కన్వీనర్ కల్ముల నాసరయ్య అన్నారు. ప్రజలు చైతన్యవంతమైతనే ఈ సమస్యను శాశ్వతంగా పోగొట్టవచ్చన్నారు. ఈ సందర్భంగా అమ్రాబాద్, పదర మండల పరిధిలోని అన్ని రాజకీయ, ప్రజా సంఘాల, కుల సంఘాల, యువజన సంఘాల నాయకులతో కలిసి ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో నాసరయ్య మాట్లాడుతూ 2011లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ నల్లమల, పులివెందులలో యురేనియంపై సర్వేలు నిర్వహించారు. ఇక్కడి ప్రజలు పోరాటాలకు దిగితే ప్రభుత్వం వెనుదిరిగింది.
పులివెందుల పరిధిలోని తుమ్మాలపల్లి వద్ద యూరేనియం సేకరించి ప్రారంభించారు. ఇప్పుడు అక్కడ రేడియేషన్ కారణంగా ప్రజలు, ప్రాణులు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మళ్లీ ఇప్పుడు మనం కలసికట్టుగా పోరాడితే ఈ ముప్పు తప్పించుకోవచ్చారు. అలాగే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే ప్రతి గ్రామాలలో కమిటీలను ఏర్పాటు చేసి గ్రామ సభలు నిర్వహించి ప్రజలను చైతన్య పరచాలన్నారు. తరాలుగా వేధిస్తున్న ఈ సమస్య కేవలం అమ్రాబాద్, పదర మండలాలది కాదని.. ప్రకృతి వినాశనానికి సంబంధించిందన్నారు. దీనిపై సుప్రీం కోర్టుకు, అవసరమైతే ఐక్యరాజ్య సమితికి ప్రజల ద్వార ఉత్తరాలను పంపుతామని అన్నారు.