- బిహార్లో 40 మంది మహిళలపై జరిగిన స్టడీలో వెల్లడి
- ఆందోళన అవసరంలేదంటున్న సైంటిస్టులు
- డబ్ల్యూహెచ్ఓ సేఫ్ లిమిట్ కంటే తక్కువే ఉన్నట్టు ప్రకటన
న్యూఢిల్లీ: బిహార్లో నిర్వహించిన ఓ స్టడీలో తల్లిపాలలో ప్రమాదకరమైన యురేనియం రసాయన మూలకం ఆనవాళ్లు బయటపడ్డాయి. అయితే, దీనిపై ఆందోళన అవసరం లేదని, తల్లిపాలలో యురేనియం స్థాయిలు చాలా స్వల్పంగా మాత్రమే ఉన్నాయని సైంటిస్టులు స్పష్టం చేశారు. పాట్నాలోని మహవీర్ క్యాన్సర్ సంస్థాన్ అండ్ రీసెర్చ్ సెంటర్, లవ్ లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, ఢిల్లీ ఎయిమ్స్ ఆధ్వర్యంలో బిహార్ లో బిడ్డలకు పాలు ఇస్తున్న 40 మంది తల్లులపై ఈ స్టడీ జరిగింది. వివిధ జిల్లాల్లోని తల్లుల పాలను సేకరించి, పరీక్షించగా.. అన్ని శాంపిల్స్ లోనూ యురేనియం (యూ238) ఎలిమెంట్ ఆనవాళ్లు కనిపించాయి. ఈ స్టడీలో సేకరించిన తల్లిపాల శాంపిల్స్ లో 5 పీపీబీ(పార్ట్స్ పర్ బిలియన్) యురేనియం ఉన్నట్టు గుర్తించారు. అలాగే 70% మంది శిశువుల్లో యురేనియం లెవల్స్ కారణంగా క్యాన్సర్ యేతర వ్యాధుల ముప్పు పొంచి ఉన్నట్టు స్టడీలో గుర్తించామని స్టడీ కోఆథర్, ఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన డాక్టర్ అశోక్ శర్మ వెల్లడించారు. అయితే, యురేనియం ఎలిమెంట్ కు దీర్ఘకాలికంగా ఎక్స్ పోజ్ అయితే తీవ్ర అనారోగ్యానికి దారి తీసే అవకాశం ఉన్నప్పటికీ, తాజా అధ్యయనంలో స్వల్ప యురేనియం లెవల్స్ వల్ల శిశువుల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం ఉండబోదన్నారు. ఆ తల్లులు తమ బిడ్డలకు పాలను ఇవ్వొచ్చని సూచించారు. వీరి స్టడీ రిపోర్ట్ ఇటీవల ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ అనే బ్రిటిష్ జర్నల్ లో పబ్లిష్ అయ్యాయి.
లిమిట్ కంటే ఆరు రెట్లు తక్కువగానే..
తల్లిపాలలో యురేనియం ఆనవాళ్లు ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మాజీ డైరెక్టర్, ఎన్ డీఎంఏ సభ్యుడు డాక్టర్ దినేశ్ కె. అశ్వాల్ స్పష్టం చేశారు. ‘‘ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొన్న ప్రకారం.. మనం తాగే నీటిలో యురేనియం 30 పీపీబీకి మించితే ప్రమాదకరం. కానీ బిహార్ లో జరిగిన స్టడీలో తల్లిపాలలో యురేనియం లెవల్స్ ఆ లిమిట్ కంటే ఆరు రెట్లు తక్కువగానే ఉన్నాయి. అందువల్ల ఈ యురేనియం స్థాయిలతో పెద్దగా ప్రమాదమేమీ ఉండదు” అని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ యురేనియం సహజంగానే మట్టి ద్వారా మనుషుల శరీరంలోకి చేరుతుందని, ఇందులో ఎక్కువ భాగం మూత్ర విసర్జన ద్వారానే బయటకు వెళ్లిపోతుందన్నారు. అందువల్ల తల్లిపాలలో చాలా తక్కువ స్థాయిలోనే యురేనియం ఆనవాళ్లు ఉంటాయన్నారు. కాగా, మన దేశంలో 18 రాష్ట్రాల్లోని 151 జిల్లాల్లో భూగర్భ జలాల్లో యురేనియం ఆనవాళ్లు ఉన్నట్టు గతంలో జరిగిన స్టడీల్లో తేలింది.
