సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణాన్ని అర్బన్ నక్సల్స్ అడ్డుకున్నరు

సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణాన్ని అర్బన్ నక్సల్స్ అడ్డుకున్నరు
  • ఎన్విరాన్ మెంట్ మినిస్టర్ల సమావేశంలో ప్రధాని మోడీ

అహ్మదాబాద్: గుజరాత్‌‌లోని నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణాన్ని అర్బన్ నక్సల్స్, సంఘ వ్యతిరేక శక్తులు అడ్డుకున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆ డ్యాంతో పర్యావరణానికి హాని కలుగుతుందంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. అటువంటి అర్బన్ నక్సల్స్ ఇంకా యాక్టివ్ గా ఉన్నారని, అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు వారికి కొన్ని రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోందని ఆరోపించారు. శుక్రవారం గుజరాత్ లోని నర్మద జిల్లాలో పర్యావరణ మంత్రుల జాతీయ సమావేశాన్ని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి మాట్లాడారు. డెవలప్ మెంట్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు న్యాయవ్యవస్థ, వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలను సైతం అర్బన్ నక్సల్స్ ప్రభావితం చేస్తున్నారని, ఈ నేపథ్యంలో అటువంటి ప్రాజెక్టులు ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకెళ్లేలా చూసుకోవాలని మంత్రులను కోరారు.  సంఘ విద్రోహ శక్తుల కుట్రలకు కౌంటర్ వేసేందుకు పర్యావరణ అనుమతుల మంజూరులో స్థిరమైన వైఖరిని అవలంబించాలని సూచించారు.  ‘‘పలు అభివృద్ధి ప్రాజెక్టులకు అర్బన్ నక్సల్స్ అడ్డుపడుతుండడం వల్ల ఇప్పటికే చాలా డబ్బు వృధా అయింది. ప్రస్తుతం సర్దార్ సరోవర్ డ్యాం పూర్తయింది. ఈ డ్యాం కడితే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని అర్బన్ నక్సల్స్ చేసిన దుష్ర్పచారం ఎంత అవాస్తవమో త్వరలోనే తెలుస్తది. వాస్తవానికి ఈ డ్యాం పర్యావరణ ప్రియులకు భవిష్యత్తులో తీర్థక్షేత్రంగా మారుతుంది” అని మోడీ అన్నారు.

ప్రాజెక్టుల క్లియరెన్స్ లో జాప్యం వద్దు

ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయడంలో ఆలస్యం జరగడం బాధాకరమైన విషయమని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా అనుమతులిస్తేనే అభివృద్ధి పనుల్లో వేగం ఉంటుందని, డెవలప్​మెంట్ విషయంలో రాజీపడకుండా అనుమతులివ్వాలని సూచించారు. ఇప్పటికే ఎన్విరాన్‌‌మెంట్ క్లియరెన్స్ కు సంబంధించి 6 వేల అప్లికేషన్లు, అటవీ అనుమతులకు సంబంధించి 6,500 అప్లికేషన్లు పలు రాష్ట్రాల్లో పెండింగ్‌‌లో ఉన్నాయని తెలిపారు. అనుమతులను ఆలస్యం చేస్తే, ప్రాజెక్టుల వ్యయం పెరుగుతుందన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే దేశ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం రెండింటికీ లాభమని, ఢిల్లీలో ఇటీవలే ప్రారంభించిన ప్రగతి మైదాన్ టన్నెలే ఇందుకు నిదర్శనమన్నారు.  “ప్రగతి మైదాన్ టన్నెల వల్ల ఏడాదికి 55 లక్షల లీటర్ల ఇంధనం ఆదా అవుతుంది. 13 వేల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు. ఆ స్థాయి ఉద్గారాలను తగ్గించాలంటే 6 లక్షల చెట్లు అవసరం. ఫ్లై ఓవర్లు, రోడ్లు, రైల్వే ప్రాజెక్టులు కర్బన ఉద్గారాలను తగ్గించడంలో తోడ్పడుతాయి. కాబట్టి పర్యావరణ క్లియరెన్స్ ఇచ్చేటప్పుడు ఈ విషయాన్ని మరవరాదు” అని మోడీ పేర్కొన్నారు.

పాత వాహనాలను త్వరగా తుక్కుగా మార్చాలి

పర్యవారణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వ వెహికల్ స్ర్కాపేజీ (పాత, ఫిట్ నెస్ లేని వాహనాలను తుక్కుగా మార్చడం) పాలసీని త్వరగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను మోడీ కోరారు. అధికారిక వాహనాల్లో సాధ్యమైనంత వరకు బయో ఇంధనం వాడాలని సూచించారు.