
తాడ్వాయి, వెలుగు: మండలంలోని కృష్ణాజీవాడి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో మంగళవారం పోలీసులు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు ఒక్క బస్తా చొప్పున పంపిణీ చేసినట్లు ఏవో నరసింహులు తెలిపారు. ఎలాంటి ఘర్షణ జరగకుండా తాడ్వాయి ఎస్సై మురళి తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
తెల్లవారు జామునుంచే క్యూ
బాల్కొండ, వెలుగు: మండలంలో తెల్లవారుజాము నుంచే యూరియా కోసం రైతులు క్యూ కడుతున్నారు. బాల్కొండ వ్యవసాయాధికారి ఆఫీస్వద్దకు మంగళవారం పట్టా పాస్బుక్స్జిరాక్స్ లు తీసుకుని రైతులు వచ్చారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
వరి పంట పొట్టదశకు చేరినా యూరియా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరికి ఒక్క బస్తా మాత్రమే ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. ప్రస్తుతం బాల్కొండ కార్యాలయానికి 220 బస్తాల లోడు వచ్చిందని, త్వరలో మరొక లోడ్ రాగానే సరిపడా యూరియా అందజేస్తామని వ్యవసాయాధికారి తెలిపారు.