
కామారెడ్డి, వెలుగు : దోమకొండ, బీబీపేట మండల కేంద్రాల్లోని సొసైటీల వద్ద శుక్రవారం యూరియా కోసం రైతులు బారులుదీరారు. దోమకొండ, బీబీపేట సొసైటీలకు గురువారం సాయంత్రం 400 బస్తాల చొప్పున యూరియా వచ్చింది. దీంతో శుక్రవారం పొద్దునే రైతులు లైన్లో నిలబడ్డారు. స్టాక్ తక్కువగా ఉండటం రైతులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి.
దోమకొండలో ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పున, బీబీపేటలో ఒక్కో రైతుకు బస్తా యూరియా పంపిణీ చేశారు. ఆయా మండలాల్లో యూరియా సమస్యపై కాంగ్రెస్ లీడర్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ దృష్టికి తీసుకెళ్లారు. షబ్బీర్అలీ వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో ఫోన్లో మాట్లాడారు. కామారెడ్డి ఏరియాకు సరిపడా యూరియా సప్లయ్ చేయాలని మంత్రిని కోరారు.