2011 వరల్డ్‌కప్ ఫైనల్‌పై దర్యాప్తు జరగాలి

2011 వరల్డ్‌కప్ ఫైనల్‌పై దర్యాప్తు జరగాలి

న్యూఢిల్లీ: ఇండియా–శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్‌ అయ్యిందంటూ శ్రీలంక స్పోర్ట్స్‌ మినిస్టర్ మహిందానంద అలుత్‌గమాగే రీసెంట్‌గా విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్, మాజీ ప్లేయర్ అరవింద డిసిల్వా స్పందించాడు. ప్రజలను ఎప్పుడూ అబద్ధాల నుంచి దూరం చేయడానికి అనుమతించలేమని చెప్పిన డిసిల్వా.. దీనిపై విచారణ చేయాలని ఐసీసీ, బీసీసీఐతోపాటు ఎస్‌ఎల్‌సీకి విజ్ఞప్తి చేశాడు.

‘మనం వరల్డ్‌కప్ విజయాన్ని ఆస్వాదించాం. సచిన్ లాంటి ప్లేయర్స్‌ తమ జీవితాంతం ఆ క్షణాలను అనుభూతి చెందుతూనే ఉంటారు. తాము గెలిచింది ఫిక్స్‌ అయిన వరల్డ్‌కప్ లేదా అనేది తెలుసుకోవాలంటే సచిన్‌, ఇండియాలో ఉన్న మిలియన్ల క్రికెట్ ఫ్యాన్స్‌తోపాటు ఆ దేశ ప్రభుత్వం దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలి. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చాలా మంది ప్రజలపై ప్రభావం చూపుతాయి. మాతోపాటు సెలెక్టర్స్, ప్లేయర్స్, టీమ్ మేనేజ్‌మెంట్‌, టైటిల్ గెలిచిన ఇండియా క్రికెటర్స్‌పై ఆ ప్రభావం పడుతుంది. మనం ఇంతగా ప్రేమించే ఈ గేమ్‌ కోసం దీన్ని మనం నివృత్తి చేసుకోవాల్సిందే’ అని అరవింద డిసిల్వా చెప్పాడు.