
2014 కు ముందు బ్యాంకులు, ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)ల వైఫల్యం వల్లే ఎన్‌పీఏలు కొండలా ఎదిగిపోయాయని, ఫలితంగా మూలధన నిల్వలు హరించుకుపోయాయని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ చెప్పారు. కిందటేడాది డిసెంబర్ 10 న గవర్నర్ పదవికి రాజీనామా చేశాక, ఉర్జిత్ పటేల్ మాట్లాడటం ఇదే మొదటిసారి. బ్యాంకులు విచ్చలవిడిగా అప్పులిచ్చాయని, ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించిందని పటేల్ వ్యాఖ్యానించారు. ఎన్‌పీఏల విషయంలో రిజర్వ్ బ్యాంకు మరింత ముందుగా నిద్ర లేచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో జరిగిన ఈవెంట్‌లో జూన్ 3 న పటేల్ మాట్లాడారు. ఇండియా బ్యాంకింగ్ రంగం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఎన్‌పీఏలని, అందులోనూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్‌పీఏలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రస్తావించారు. మూలధన నిల్వలను ఎక్కువ చేసి చూపిస్తున్నారని, ఎన్‌పీఏల వల్ల ఎదురయ్యే వత్తిడిని అధిగమించడానికి ఈ మూలధన నిల్వలు సరిపోవని పేర్కొన్నారు. 2014 కి ముందు ప్రభుత్వం, బ్యాంకులు, ఆర్‌బీఐ చర్యలే ఎన్‌పీఏలు పెరిగిపోవడానికి కారణమని కుండబద్దలు కొట్టారు. 2014లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక, రఘురాం రాజన్ ఆధ్వర్యంలో ఆర్‌బీఐ ఎసెట్ క్వాలిటీని సమీక్షించిందని చెప్పారు. నాన్ పెర్‌ఫార్మింగ్ ఎసెట్స్ భారీగా పెరిగాయని మొదటిసారిగా అప్పుడే గుర్తించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త ఇన్‌సాల్వెన్సీ చట్టాన్ని తొందరగా అమలులోకి తెచ్చారన్నారు. ఈ చర్యలన్నింటి కారణంగా ఆర్థిక వ్యవస్థకు బ్యాంకులు అవసరమైన నిధులను అందించలేకపోయాయని చెప్పారు.