అమెరికా వద్దంటోండి.. టెక్ నిపుణులను రమ్మంటూ జర్మనీ, యూకే, కెనడా జాబ్ ఆఫర్లు..!

అమెరికా వద్దంటోండి.. టెక్ నిపుణులను రమ్మంటూ జర్మనీ, యూకే, కెనడా జాబ్ ఆఫర్లు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల H-1B వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ నిబంధనల మార్పు తీసుకురావటంతో.. భారతీయ ఐటీ నిపుణులకు పెద్ద దెబ్బగా మారింది. అమెరికా వలస విధానాలు ఇంకా కఠినతరం అవుతున్న నేపథ్యంలో జర్మనీ, యూకే, కెనడా, చైనా వంటి దేశాలు దీనిని అవకాశంగా మలుచుకొని భారత ప్రతిభను ఆకర్షించేందుకు ముందుకొస్తున్నాయి.

ముందుగా జర్మనీ రాయబారి ఫిలిప్ ఆకర్మాన్ భారతీయులకు స్పష్టమైన ఆహ్వానం ఇస్తూ.. "మా వలస విధానం విశ్వసనీయంగా, ఆధునికంగా, స్థిరంగా ఉంటుంది. భారతీయ ప్రతిభను స్వాగతిస్తాం" అని ప్రకటన చేశారు. జర్మనీలో టెక్నాలజీ రంగంలో వందలకొద్దీ ఉద్యోగాలు ఉన్నాయని.. ఐటీ నైపుణ్యాలు కలిగిన వారికి వీసా మద్దతుతో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని జర్మనీ అధికారులు పేర్కొంటున్నారు.

అమెరికాలోని H-1B నిపుణులను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తే.. కెనడా GDPలో 1% వృద్ధి జరుగుతుందని ‘బిల్డ్ కెనడా’ సంస్థ లెక్కగట్టింది. కెనడా ప్రభుత్వం ప్రత్యేక వర్క్ పర్మిట్ ప్రణాళికను పరిశీలిస్తోంది. అలాగే, Neo Financial, Wise వంటి కెనడియన్ ఫిన్టెక్ కంపెనీలు వీసా స్పాన్సర్‌షిప్‌తో ఉద్యోగ అవకాశాలను విస్తృతంగా ప్రకటిస్తున్నాయి.

►ALSO READ | ప్రపంచంలోనే తొలి 'రాడార్‌-ఇంటిగ్రేటెడ్' బైక్: అల్ట్రావయొలెట్ X47 క్రాసోవర్ స్పెషాలిటీస్ ఇవే..

యూకేలో స్టార్టప్ కోలిషన్ ఇప్పటికే ప్రభుత్వం వద్ద టాలెంట్ ఆకర్షణ ప్రక్రియను సులభతరం చేయాలని విజ్ఞప్తి చేసింది. లండన్‌కు చెందిన Cleo స్టార్టప్ 100 కొత్త ఉద్యోగాలను పూర్తి వీసా స్పాన్సర్‌షిప్‌తో ప్రకటించింది. CRM సాఫ్ట్‌వేర్ కంపెనీ Attio కూడా ఇలాంటి అవకాశాలను చూపిస్తోంది. అదనంగా Synthesia, Eleven Labs, Granola వంటి ఏఐ ఆధారిత స్టార్టప్స్ కూడా భారత ప్రతిభను ఆకర్షించేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

ఇదే క్రమంలో చైనా నిపుణుల కోసం కొత్త K-వీసా విధానాన్ని అక్టోబర్ 1 నుంచి ప్రారంభించబోతుంది. ఇది కూడా భారత టెక్ టాలెంట్‌కు ఒక ప్రత్యామ్నాయంగా నిలవనుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమెరికా వీసా విధానాల కఠినతరం కారణంగా.. భారత యువ ఇంజినీర్లు, టెక్ నిపుణులు తరలిపోవడానికి జర్మనీ, కెనడా, యూకే ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. అయితే టాలెంట్ దేశం వీడకుండా అవకాశాలు కల్పించేందుకు భారత్ ఎలాంటి ప్రణాళికలతో వస్తుందో వేచి చూడాల్సిందే.