
న్యూఢిల్లీ : ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోలోని కొంత వాటాను యూఎస్ హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్ తాజాగా విక్రయించింది. గతంలో జొమాటోలో 5.11 శాతం వాటా ఉండగా, ఇందులో 2.34 శాతం వాటా లేదా 18.44 కోట్ల షేర్లను టైగర్ గ్లోబల్ అమ్మింది. దీంతో జొమాటోలో ఈ హెడ్జ్ ఫండ్ వాటా 2.77 శాతానికి తగ్గింది. కిందటి నెల 25 నుంచి ఈ నెల 2 మధ్య బల్క్ డీల్స్ కింద జొమాటో షేర్లను ఈ సంస్థ సేల్ చేసింది. ఐపీఓ కంటే ముందు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు కంపెనీ లిస్టింగ్ అయిన తర్వాత ఏడాది వరకు షేర్లను అమ్మకుండా ఉండాలి. తాజాగా ఈ లాకిన్ పీరియడ్ పూర్తవ్వడంతో కంపెనీలో షేర్లను ఈ హెడ్జ్ ఫండ్ సేల్ చేసింది. ఈ లాకిన్ పీరియడ్ పూర్తయిన తర్వాత నుంచి మరికొంత మంది ఇన్వెస్టర్లు కూడా జొమాటో నుంచి బయటకొచ్చేశారు. ఉబర్ టెక్నాలజీస్ జొమాటోల 7.78 శాతం వాటాను బుధవారం అమ్మిన విషయం తెలిసిందే. షేరు ధర రూ. 50.44 వద్ద జొమాటో షేర్లను ఉబర్ విక్రయించింది. ఈ షేర్లను ఫిడిలిటీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కొన్నారని వార్తలొస్తున్నాయి. కంపెనీ షేరు తన ఆల్టైమ్ హై రూ. 169 నుంచి 66 శాతం పైగా తగ్గి రూ. 40 వరకు పడిన విషయం తెలిసింది.
జొమాటో జూమ్..
ఆల్టైమ్ కనిష్టాలకు పడిపోయిన జొమాటో షేరు, గత ఐదు సెషన్ల నుంచి పెరుగుతూ వస్తోంది. ఈ ఐదు సెషన్లలోనే కంపెనీ షేరు 21 శాతం పెరగడం గమనించాలి. రూ. 40 వద్ద ఆల్టైమ్ కనిష్టాన్ని తాకిన జొమాటో, గురువారం రూ. 58 వరకు వెళ్లింది. చివరికి రూ.56.80 వద్ద ముగిసింది.