భారత ఐటీ ఉద్యోగులకు కొత్త కష్టం.. అమెరికా తెస్తున్న హైర్ యాక్ట్ 2025 ప్రభావం ఎంత..?

భారత ఐటీ ఉద్యోగులకు కొత్త కష్టం.. అమెరికా తెస్తున్న హైర్ యాక్ట్ 2025 ప్రభావం ఎంత..?

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత అన్ని చట్టాల్లోనూ కీలక మార్పులు తెస్తున్నారు. ప్రధానంగా విదేశాల నుంచి అమెరికాకు వస్తున్న విద్యార్థులు, ఉద్యోగులపై ట్రంప్ సీరియస్ గా ఉన్నారు. ఆయన ఏం చేసినా అమెరికాకు ఏంటి లాభం అనే ఆలోచనతోనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. అమెరికాలో కొత్త హైరింగ్ పాలసీHIRE Act–2025 తీసుకురాబడింది. అయితే దీని వల్ల భారతీయ ఐటీ పరిశ్రమతో పాటు టెక్ ఉద్యోగులు భారీ ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ట్రంప్ తెచ్చిన కొత్త బిల్లు ద్వారా అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకుంటే.. లేదా విదేశాల్లో పని చేసే సంస్థలకు సేవలకి డబ్బు చెల్లిస్తే.. ఆ మొత్తంపై 25% ట్యాక్స్ వసూలు చేయనున్నారు. దీంతో భారతీయ టెక్ కంపెనీల ఔట్ సోర్సింగ్ సేవలతో పాటు విదేశాలకు ఆన్ సైట్ కోసం వెళుతున్న టెక్కీల భవిష్యత్తుపై కూడా నీలినీడలు అలుముకుంటున్నాయి. ఈ 'ఔట్‌సోర్సింగ్ పేమెంట్'పై ట్యాక్స్.. అమెరికా వినియోగదారులకు లాభించే విధంగా చేసే విదేశీ సేవలకు వర్తిస్తుంది. అంటే ఇకపై అవి ఖరీదుగా మారతాయి. 

ALSO READ : ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ లేదు..

కంపెనీలు ఈ ఖర్చును తమ వ్యాపార ఖర్చుల్లో చేసుకోవడానికి కూడా అనుమతిలేదు. ఈ డబ్బును 'డొమెస్టిక్ వర్క్‌ఫోర్స్ ఫండ్' పేరుతో అమెరికాలోనే ఉపాధి, శిక్షణ కార్యక్రమాలకు వాడనున్నారు. అమెరికా కంపెనీలు చేసే ఐటీ, బిజినెస్ ప్రాసెసింగ్ పనిలో 60% వరకు భారత్‌లోని కంపెనీలకే ఔట్‌సోర్స్ అవుతుంది. అందువల్ల ట్రంప్ తెచ్చిన చట్టంతో 25% అదనపు ట్యాక్స్ వల్ల అమెరికా కంపెనీలు విదేశాలకు వర్క్ ఇవ్వటాన్ని తగ్గించవచ్చు. ఇది పరోక్షంగా భారతదేశంలోని ఐటీ పరిశ్రమను భారీగా కుదిపేయనుంది. ఇప్పటికే ఏఐ ప్రకంపనలతో అల్లాడిపోతున్న టెక్కీలు అమెరికా తెచ్చిన చట్టంతో జాబ్ సెక్యూరిటీపై ఆందోళన చెందుతున్నారు. 

కొత్త ప్రాజెక్టుల సంగతి పక్కన పెడితే యూఎస్ మార్కెట్ నుంచి ఇప్పటికే ఉన్న ఆర్డర్లను నిలుపుకోవటం కూడా కష్టంగా మారవచ్చని ఆందోళనలు భారతీయ ఐటీ కంపెనీల్లో పెరుగుతోంది. కొత్త ట్యాక్స్ వల్ల వచ్చే అదనపు ఖర్చు అమెరికాలో వ్యాపార ఖర్చుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కంపెనీలు తమ కంపెనీ మార్జిన్లు తగ్గించుకోవాలి లేదా ఖర్చు కొంత క్లయింట్ మీద వేయాల్సి ఉంటుంది. ఇదే తీరులో కొనసాగితే భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాపై ఆధారపడకుండా ఆసియా, యూరోప్ వంటి ఇతర మార్కెట్లవైపు దృష్టి మళ్లించాల్సిన అవసరం తప్పదని నిపుణులు అంటున్నారు. 

ఈ బిల్లు ఇంకా ప్రవేశపెట్టిన దశలో ఉంది. పూర్తిగా ఎలాంటి మార్పులు జరుగుతాయో కచ్చితంగా చెప్పలేం. కానీ అమెరికా ఇలాంటి నియంత్రణలతో సాగితే భారతీయుల ఉద్యోగ భద్రతకి స్పష్టంగా ముప్పు ఉంటుంది.