- డిసెంబర్లో 3.4 శాతానికి పెరిగిన సీపీఐ
న్యూఢిల్లీ: యూఎస్‌లో ఇన్ఫ్లేషన్ డిసెంబర్లో అంచనాల కంటే ఎక్కువ పెరిగింది. కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) కిందటి నెలలో 0.3 శాతం (అంతకు ముందు నెలతో పోలిస్తే) పెరిగిందని యూఎస్ లేబర్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. 0.2 శాతం పెరుగుతుందని ఎనలిస్టులు అంచనా వేశారు. అదే 12 నెలల బేసిస్‌లో చూస్తే యూఎస్ ఇన్ఫ్లేషన్ డిసెంబర్లో 3.4 శాతానికి చేరుకుంది. ఇది 3.2 శాతం నమోదవుతుందని ఎనలిస్టులు అంచనా వేశారు. ఫుడ్, ఎనర్జీ మినహాయించి మిగిలిన ప్రొడక్ట్‌ల ధరలను కొలిచే కోర్ ఇన్ఫ్లేషన్ డిసెంబర్లో నెల ప్రాతిపదికన 0.3 శాతం, ఏడాది ప్రాతిపదికన 3.9 శాతం పెరిగింది. ఈ ఏడాది మార్చి నుంచి వడ్డీ రేట్ల కోతను ఫెడ్ మొదలు పెడుతుందని ఎనలిస్టులు భావించారు. కానీ, ఇన్ఫ్లేషన్ ఇంకా గరిష్టాల్లోనే ఉండడంతో వడ్డీ రేట్ల తగ్గింపునకు టైమ్ పట్టేటట్టు కనిపిస్తోంది.
కొద్దిగా పెరిగిన మార్కెట్
ఇన్ఫోసిస్, టీసీఎస్ రిజల్ట్స్, యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా వెలువడే ముందు బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు ఫ్లాట్‌గా క్లోజయ్యాయి. సెన్సెక్స్ గురువారం 63 పాయింట్లు (0.09 శాతం) లాభంతో 71,721 దగ్గర, నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 21,647 దగ్గర సెటిలయ్యాయి. గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్‌గా ఉండడంతో లాభాల్లో ఓపెన్ అయిన సెన్సెక్స్, నిఫ్టీ చివరికి ఇంట్రాడే గరిష్టాల నుంచి పడ్డాయి. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, బీపీసీఎల్ షేర్లు ఎక్కువగా లాభపడగా, డా. రెడ్డీస్, ఎస్బీఐ లైఫ్, హిందుస్తాన్ యూనిలీవర్, విప్రో షేర్లు నష్టాల్లో ముగిశాయి. క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ ఒక శాతం నష్టపోగా, ఐటీ ఇండెక్స్ అర శాతం తగ్గింది. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు ఒక శాతం చొప్పున పెరిగాయి.