బుషెహర్ అణు కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మిసైల్ దాడి.. రేడియేషన్తో గల్ఫ్ దేశాలకు పెను ముప్పు

బుషెహర్ అణు కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మిసైల్ దాడి.. రేడియేషన్తో గల్ఫ్ దేశాలకు పెను ముప్పు
  • యుద్ధం మొదలైనప్పటి నుంచే నాలుగోసారి అటాక్   
  • లెబనాన్‌‌లోని టైర్ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ బాంబుదాడి
  • బహ్రెయిన్ పై 8 డ్రోన్​లతో దాడి చేసిన ఇరాన్ 
  • డ్రోన్ దాడిలో దుబాయ్​లోని ఒరాకిల్ భవనం ధ్వంసం
  • ఇరాన్ లో మిస్ అయిన మూడో పైలెట్ కోసం అమెరికా గాలింపు  
  • రేడియేషన్ లీక్ అయితే గల్ఫ్ దేశాలకే ఎక్కువ ముప్పు: అరాఘ్చీ   

టెహ్రాన్/టెల్ అవీవ్/వాషింగ్టన్: ఇరాన్​లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై శనివారం ఉదయం అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేశాయి. క్షిపణి అణు కేంద్రం వెలుపలి రక్షణ కంచెను తాకిందని, ఆ సమయంలో జరిగిన పేలుడు, వెలువడిన గాజు ముక్కల (ష్రాప్నెల్) కారణంగా సిబ్బందిలో ఒకరు మరణించారని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తస్నిమ్ వెల్లడించింది. ఈ దాడి వల్ల పలు భవనాలు దెబ్బతిన్నాయని తెలిపింది. 

అయితే, అణు కేంద్రంలోని ప్రధాన విభాగాలు, రియాక్టర్ వంటి కీలక భాగాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అణు కేంద్రాలను లేదా వాటి సమీప ప్రాంతాలను ఎప్పుడూ లక్ష్యంగా చేసుకోకూడదని ఆయన స్పష్టం చేశారు. అణు కేంద్రంలోని సహాయక భవనాల్లో అత్యంత కీలకమైన భద్రతా పరికరాలు ఉండే అవకాశం ఉందన్నారు. తమ అణు కేంద్రంపై దాడిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తీవ్రంగా స్పందించారు.

 ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బుషెహర్ అణు కేంద్రంపై ఇప్పటివరకు నాలుగుసార్లు బాంబు దాడులు జరిగాయని తెలిపారు. అణు కేంద్రాల రక్షణ పట్ల అంతర్జాతీయ సమాజం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. అణు కేంద్రాలపై దాడులు కొనసాగితే వెలువడే రేడియోధార్మికత వల్ల పశ్చిమాసియాలోని ఇతర దేశాల రాజధానుల మనుగడకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. మరోవైపు యుద్ధాన్ని ఆపేందుకు చర్చలకు తాము సిద్ధమేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శనివారం మరోసారి ప్రకటించారు. 

  • ఇరాన్ పెట్రోకెమికల్ కేంద్రంపైనా దాడి 

పశ్చిమ ఇరాన్ లోని మెహ్రాన్ నగరంలో ఉన్న వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక కేంద్రంపై కూడా శనివారం వైమానిక దాడి జరిగినట్లు ఇరాన్ అధికారిక పత్రిక ‘టెహ్రాన్ టైమ్స్’ పేర్కొంది. అలాగే, నైరుతి ప్రావిన్స్ ఖుజెస్తాన్‌‌లోని మాహ్‌‌షహర్ ప్రత్యేక పెట్రోకెమికల్ జోన్‌‌పై కూడా దాడి జరిగినట్లు ఆ పత్రిక వెల్లడించింది. శనివారం ఉదయం ఈ కేంద్రంలో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఫార్స్ వార్తా సంస్థ తెలిపింది. ఈ జోన్‌‌లోని నాలుగు కంపెనీలపై దాడులు జరిగినట్లు మెహర్ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, టెహ్రాన్‌‌లోని బాలిస్టిక్, విమాన విధ్వంసక క్షిపణుల నిల్వ కేంద్రాలపై తమ వైమానిక దళం దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అంతకుముందు రోజు జరిగిన దాడుల్లో ఆయుధ తయారీ కేంద్రాలు, సైనిక పరిశోధన, అభివృద్ధి సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. 

ఇరాన్ కీలక వ్యవస్థలను, పునాదులను దెబ్బతీసే వ్యూహంలో భాగంగానే ఈ దాడులు చేస్తున్నట్లు  వెల్లడించింది.  నైరుతి ఇరాన్‌‌లోని మాహ్‌‌షహర్ పెట్రోకెమికల్ జోన్ లో ఉన్న 3 కంపెనీలపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. దక్షిణ ఇరాన్‌‌లోని బందర్ ఖమీర్ సిమెంట్ ప్లాంట్ పై కూడా దాడులు జరిగాయి. అయితే అక్కడ పనులు యథాతథంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు, లెబనాన్‌‌లోని టైర్ తీరప్రాంత నగరంలో ఉన్న లెబనీస్ ఇటాలియన్ ఆసుపత్రి సమీపంలోని భవనాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో 11మంది గాయపడగా, ఆసుపత్రి భవనం దెబ్బతిందని లెబనాన్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

  • బహ్రెయిన్‌‌పై 8 డ్రోన్ దాడులు 

గడిచిన 24 గంటల్లో తమ దేశంపై 8 డ్రోన్ దాడులు జరిగాయని బహ్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. సిత్రా ప్రాంతంలో ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్న సమయంలో పడిన శకలాల వల్ల నలుగురు పౌరులు గాయపడగా, పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి బహ్రెయిన్‌‌పై మొత్తం 188 క్షిపణులు, 453 డ్రోన్ దాడులు జరిగాయి. ఇరాన్ నుంచి శనివారం వచ్చిన 23 బాలిస్టిక్ క్షిపణులు, 56 డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. మధ్య ఇజ్రాయెల్‌‌లోని బెనె బ్రక్ నగరంపై ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. 

ఇరాన్, ఇరాక్ సరిహద్దు కేంద్రం షాలంచెహ్ పై జరిగిన దాడిలో ఒకరు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. దీంతో ఈ సరిహద్దును ఇరాక్ తాత్కాలికంగా క్లోజ్ చేసింది. మరోవైపు, కువైట్‌‌లోని క్యాంప్ బ్యూరింగ్ బేస్ వద్ద ఉన్న అమెరికా సిహెచ్-47 చినూక్ హెలికాప్టర్ కూడా ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. కువైట్, ఇతర గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దళాలు పదేపదే దాడులు చేస్తున్నాయి. హార్మూజ్ జలసంధిలో ఇజ్రాయెల్‌‌తో సంబంధం ఉన్న ‘ఎంఎస్సీ ఇషికా’ అనే నౌకపై ఐఆర్ జీసీ డ్రోన్ దాడి చేసింది. దీనివల్ల ఆ నౌకలో మంటలు చెలరేగాయి. 

  • కాల్పుల విరమణ కోసం రాయబారాలు 

యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్ట్ దేశాల రాయబారులు ప్రయత్నిస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య విభేదాలను తొలగించి, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించేలా మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఈ చర్చలు పాకిస్తాన్‌‌లో జరిగేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా పాకిస్తాన్‌‌లో చర్చలకు మొగ్గు చూపారు. కాగా, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని శనివారం ఖతార్‌‌లో పర్యటించారు. ఇరాన్ బాంబు దాడుల్లో దెబ్బతిన్న ఖతార్ ఇంధన వనరులను పునరుద్ధరించడానికి ఇటలీ సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. గల్ఫ్ దేశాల గ్యాస్ ఉత్పత్తి ప్రపంచ ఇంధన భద్రతకు ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు.

  • ఒరాకిల్‌‌ భవనంపై ఇరాన్ డ్రోన్ దాడి 

ఇరాన్ శనివారం జరిపిన డ్రోన్ దాడిలో దుబాయ్‌‌లోని ఒరాకిల్ ప్రధాన కార్యాలయం దెబ్బతింది. దుబాయ్‌‌లోని ప్రధాన రహదారి షేక్ జాయెద్ రోడ్ పక్కనే ఉన్న ఈ కార్యాలయం లక్ష్యంగా దాడి జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెలుపల అసోసియేటెడ్ ప్రెస్ ధృవీకరించిన దృశ్యాల ప్రకారం ఆ భవనం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని దుబాయ్ మీడియా ఆఫీస్ పేర్కొంది. కాగా, ఇరాన్ కు వ్యతిరేకంగా "ఉగ్రవాద గూఢచారి" కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని అమెరికాకు చెందిన 18 అతిపెద్ద టెక్ కంపెనీలపై ఐఆర్​జీసీ (ఇస్లామిక్ రివెల్యూషనరీ గార్డ్ కోర్) ఆరోపణలు చేసింది. అందుకే అవి తమకు లక్ష్యాలని ఇదివరకే హెచ్చరించింది.  ఇరాన్ ఇదివరకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ దేశాల్లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ కేంద్రాలపై కూడా డ్రోన్ దాడులు చేసింది.

  • మూడో పైలెట్ కోసం అమెరికా గాలింపు 

ఇరాన్​లో రెండు అమెరికన్ ఫైటర్ జెట్​లు కూలిన ఘటనలో ఇద్దరు పైలెట్లను రెస్క్యూ చేసిన యూఎస్ ఆర్మీ మరో పైలెట్ కోసం శనివారం కూడా గాలించింది. నైరుతి ఇరాన్​లోని మారుమూల ప్రాంతంలో అదృశ్యమైన పైలట్ కోసం అమెరికా సైన్యం తీవ్రంగా అన్వేషిస్తోంది. అయితే, కూలిపోయిన అమెరికా జెట్ నుంచి ఎజెక్ట్ అయిన ఆ పైలట్‌‌ను అప్పగిస్తే తగిన బహుమతి ఇస్తామని ఇరాన్ ప్రజలకు ప్రభుత్వం ఆఫర్ ప్రకటించింది. 

శుక్రవారం దాడికి గురైన రెండు విమానాల్లో ఒకటైన అమెరికా ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్‌‌ను ఇరాన్ గుర్తించింది. ఈ ఘటనలో ఒక సైనికుడిని యూఎస్ ఆర్మీ రక్షించగా, మరో పైలెట్ జాడ చిక్కలేదు. కాగా, యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్‌‌లో 1,900 కంటే ఎక్కువ మంది మరణించారు. గల్ఫ్ అరబ్ దేశాలు, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో 24 మందికి పైగా మరణించగా, ఇజ్రాయెల్‌‌లో 19 మంది చనిపోయారు. యుద్ధంలో ఇప్పటివరకు 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా, 365 మంది గాయపడ్డారు. లెబనాన్‌‌లో 1,300 కంటే ఎక్కువ మంది మరణించగా, 10 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. అక్కడ 10 మంది ఇజ్రాయెల్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు.