టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం ముగింపే లక్ష్యంగా శాంతి చర్చలు చివరి దశకు చేరుకున్న వేళ ఇరాన్‌పై అమెరికా మరోసారి విరుచుకుపడింది. ఇరాన్‌లోని గోరుక్, ఖేష్మ్ ద్వీపంలోని రాడార్ కేంద్రాలు, డ్రోన్ కమాండ్-అండ్-కంట్రోల్ సైట్‌లను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం భీకర దాడులు చేసింది. ఈ మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది.
అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న తమ 'ఎంక్యూ-1' (MQ-1) డ్రోన్‌ను ఇరాన్ దళాలు క్షిపణులతో కూల్చివేయడానికి ప్రతీకారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. ఆత్మరక్షణలో భాగంగానే ఈ దాడులు చేసినట్లు స్పష్టం చేసింది. అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, ఒక డ్రోన్ నియంత్రణ కేంద్రం, రెండు వన్-వే దాడి డ్రోన్‌లను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశాయని వెల్లడించింది.
ఇరాన్ డ్రోన్‌లు ప్రాంతీయ జలాల్లో సంచరిస్తున్న వాణిజ్య, సైనిక నౌకలకు ప్రత్యక్ష ముప్పును కలిగించాయని, అందుకే తక్షణ ప్రతిస్పందన వాటిని నేలమట్టం చేశామని తెలిపింది. ఈ దాడులు ప్రణాళికాబద్ధమైనవి, ఉద్దేశపూర్వకమైనవని పేర్కొంది. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ వల్ల ఎదురయ్యే తక్షణ ముప్పులను ఎదుర్కోవడమే తాజా దాడుల లక్ష్యమని అమెరికా సైన్యం స్పష్టం చేసింది.
►ALSO READ | ఇరాన్‌తో చాలా మంచి డీల్‌కు దగ్గరయ్యాం: ట్రంప్
ఈ ఆపరేషన్‌లో ఏ అమెరికన్ సైనిక సిబ్బంది కూడా గాయపడలేదని అమెరికా అధికారులు తెలిపారు. ఏవైనా ముప్పుల నుంచి తమ దేశ సిబ్బంది, ఆస్తులు, ప్రయోజనాలను అమెరికా బలగాలు కాపాడుతూనే ఉంటాయని పేర్కొంది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే.. ఇరాన్ దురాక్రమణకు ధీటుగా ప్రతిస్పందించేందుకు తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని అమెరికా తెలపింది.
కాగా, అంతర్జాతీయ జలాలపై ఎగురుతున్న అమెరికాకు చెందిన MQ-1 డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేసిందనే ఆరోపణల నేపథ్యంలో యూఎస్ ఈ దాడులకు పాల్పడింది. ఇరాన్-అమెరికా మధ్య పీస్ డీల్ చివరి స్టేజ్‌లో ఉన్న వేళ ఇరుదేశాల మధ్య మళ్లీ సైనిక ఘర్షణలు నెలకొనడంతో నెక్ట్స్ ఏం జరగబోతుందని ఉత్కంఠ నెలకొంది.
