మంగళూరు: గల్ఫ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత వల్ల చమురు సరఫరాలో అనిశ్చితి నెలకొన్న తరుణంలో, అమెరికా ఎల్పీజీ నౌక ఆదివారం న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది. టెక్సస్‌లోని పోర్టు నుంచి ఫిబ్రవరి14న బయలుదేరిన "పిక్సిస్ పయనీర్" అనే నౌక 16,714 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ తీసుకువచ్చిందని అధికారులు తెలిపారు.
దీనిని 'ఏజిస్ లాజిస్టిక్స్' సంస్థకు అప్పగించనున్నారు. రష్యాకు చెందిన "ఆక్వా టైటాన్" నౌక వచ్చిన ఒక్క రోజు వ్యవధిలోనే ఈ నౌక కూడా ఓడరేవుకు చేరుకోవడం గమనార్హం. భారతదేశపు అతిపెద్ద భూగర్భ ఎల్‌పీజీ నిల్వ కేంద్రం మంగళూరులో ఉండటంతో ఈ నౌకలను ఇక్కడికి తరలించారు. సెప్టెంబర్ 2025 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ నిల్వ కేంద్రం సముద్ర మట్టానికి 225 మీటర్ల లోతులో ఉంది.
దీని సామర్థ్యం 80,000 మెట్రిక్ టన్నులు. చైనాకు వెళ్లాల్సిన రష్యా ముడి చమురు ట్యాంకర్ "ఆక్వా టైటాన్" కొద్ది రోజుల క్రితం భారత్ వైపు మళ్లింది. 7.7 లక్షల బారెళ్ల ముడి చమురుతో ఈ నౌక మంగళూరు తీరానికి చేరుకుంది.
