ప్రిగోజిన్‌‌ చనిపోయి ఉండొచ్చు.. అమెరికా జనరల్‌‌ అబ్రమ్స్‌‌ అనుమానం

ప్రిగోజిన్‌‌ చనిపోయి ఉండొచ్చు.. అమెరికా జనరల్‌‌ అబ్రమ్స్‌‌ అనుమానం

మాస్కో (రష్యా): రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌‌‌‌ పుతిన్‌‌కు ఎదురు తిరిగిన వాగ్నర్‌‌‌‌ గ్రూప్‌‌ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్‌‌ చనిపోయి ఉండొచ్చని అమెరికా మిలటరీ మాజీ అధికారి ఒకరు పేర్కొన్నారు. తిరుగుబాటు తర్వాత ఆయన్ను జైల్లో పెట్టే అవకాశం కూడా ఉందన్నారు. అమెరికా మాజీ జనరల్‌‌ రాబర్ట్‌‌ అబ్రమ్స్‌‌ ఏబీసీ న్యూస్‌‌తో మాట్లాడుతూ, ‘‘మనం మళ్లీ ప్రిగోజిన్‌‌ను చూస్తామా లేదా అనేది అనుమానంగా ఉంది. అతను చనిపోయి ఉండొచ్చు. ఒకవేళ బతికి ఉంటే మళ్లీ చూస్తామన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే, ఎక్కడో జైల్లో ఉండి ఉంటారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే”అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 

ఆయుధాలు అప్పగిస్తున్న వాగ్నర్‌‌‌‌ గ్రూప్‌‌..

వాగ్నర్‌‌‌‌ గ్రూప్‌‌నకు చెందిన కిరాయి సైనికులు తమ ఆయుధాలను రష్యా సైన్యానికి అప్పగిస్తున్నారని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఇప్పటివరకు యుద్ధ ట్యాంకులు, రాకెట్‌‌ లాంచర్లు, భారీ ఫిరంగులు, వాయు రక్షణ వ్యవస్థల్లాంటి 2 వేలకు పైగా ఆయుధాలు, 2,500 టన్నుల మందుగుండును, 20 వేల తుపాకులను అప్పగించినట్లు తెలిపింది. కాగా,  రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగును విమర్శించిన రష్యన్‌‌ జనరల్‌‌ ఇవాన్‌‌ పొపోవ్‌‌పై వేటు పడింది. వాగ్నర్‌‌‌‌ గ్రూప్‌‌ దళాలు తిరుగుబాటు చేయడానికి ప్రధాన కారణం షోయిగునేనని ఇవాన్‌‌ విమర్శించడంతో ఆయనను రష్యా మిలిటరీ ఉన్నతాధికారులు డిస్మిస్‌‌ చేశారు.