
కడుపులో పెరిగే బిడ్డకు.. తల్లికి మధ్య ఉండే గొప్ప అనుబంధాన్ని చెప్పే సంఘటన ఇది. యునైటెడ్ స్టేట్స్ లో జరిగింది ఇది. మనుషుల మధ్య బంధం అంటే ఎంత బలంగా ఉంటుందో.. యునైటెడ్ స్టేట్స్ లో జరిగే పలు సంఘటనలు చెప్పకనే చెబుతుంటాయి.
మిస్సోరిలోని ఫెయిర్ గ్రూవ్ లో షరన్ , మైకేల్ భార్యభర్తలు. 40 ఏళ్ల వయసులో ఆమె కన్సీవ్ అయింది. వారిద్దరూ పట్టరాని సంతోషంలో మునిగిపోయారు. పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కన్నారు. కానీ.. వారి ఊహించని చేదు నిజం డాక్టర్లు చెప్పారు.
14 వారాల(మూడున్నర నెలల) వయసులో ఉన్నప్పుడు బేబీ మిస్‌క్యారేజ్ అయింది. కడుపులో పిండం గుండె కొట్టుకోవడం ఆగిపోయి చనిపోయింది. దీంతో.. షరన్, మైకేల్ తీవ్రమైన ఆవేదన చెందారు. కడుపులో ఉన్నది ఓ మెడికల్ వేస్ట్ అని… ముక్కలు ముక్కలుగా చేసి బయటకు తీస్తామని డాక్టర్లు చెప్పడంతో.. చాలా ఆందోళనపడ్డారు. అలా చేయడానికి ఒప్పుకోలేదు.
సైన్స్ భాషలో అది అప్పటికి పిండం మాత్రమే. కానీ.. తమకు మాత్రం కన్నబిడ్డేఅనీ.. మనిషే అని భావించారు. అన్నీ బాగుండుంటే మగబిడ్డ పుట్టేదని డాక్టర్లు నిర్ధారించారు. సర్జరీకి సిద్ధపడి ఆ పసిగుడ్డును అలాగే బయటకు తీయించారు.
ఆ పిండం.. 4 అంగులాల పొడవు ఉంది అంతే. 26 గ్రాముల బరువుతో ఉంది. 14 వారాలు మాత్రమే వయసున్న ఆ పిండానికి 20 వారాల వయసు పరిణతి ఉందని డాక్టర్లు చెప్పారు. ముఖం.. చేతులు… కాళ్లు.. అన్నీ కనపడుతండేసరికి.. ఆ తల్లిదండ్రులు అపురూపంగా భావించారు. వారం రోజుల పాటు.. ఆ బేబీని అలాగే ఫ్రీజర్ లో ఉంచారు. చిట్టిచిట్టి చేతులు, కాళ్లను తడుముతూ.. తల్లి షరన్ ఫొటోలు తీసుకుంది.
ఆ తర్వాత తమ బిడ్డ రూపాన్ని ఓ జ్ఞాపకంగా మార్చుకోవాలనుకున్నారు ఆ పేరెంట్స్. పొదల్లా పెరిగే.. హైడ్రేంజియా పూల మొక్కను కుండీలో నాటి.. ఆ మట్టిలో.. మిరాన్ ను పూడ్చిపెట్టారు.
వారు దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. బాగా వైరల్ అయ్యాయి. వారి ప్రేమ, బంధానికి ఇచ్చిన విలువ చూసి.. సోషల్ మీడియా కూడా మెచ్చుకుంటోంది.