యూఎస్‌‌ ఓపెన్‌‌ సెమీస్‌‌లో కార్లోస్‌‌ అల్కరాజ్‌‌

యూఎస్‌‌ ఓపెన్‌‌ సెమీస్‌‌లో కార్లోస్‌‌ అల్కరాజ్‌‌
  • మెద్వెదెవ్‌‌, సబలెంక, కీస్‌‌ కూడా..
  • వోండ్రుసోవా, రబ్లెవ్‌‌, జ్వరెవ్‌‌ ఔట్‌‌

న్యూయార్క్‌‌‌‌: వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌వన్‌‌‌‌, డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ కార్లోస్‌‌‌‌ అల్కరాజ్.. యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో దూసుకుపోతున్నాడు. తనకంటే అనుభవజ్ఞులైన ప్లేయర్లపై అద్భుత విజయాలు సాధిస్తూ సెమీస్‌‌‌‌లోకి ప్రవేశించాడు. బుధవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌ఫైనల్లో టాప్‌‌‌‌సీడ్‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌ (స్పెయిన్‌‌‌‌) 6–3, 6–2, 6–4తో 12వ సీడ్‌‌‌‌ అలెగ్జాండర్‌‌‌‌ జ్వరెవ్‌‌‌‌ (జర్మనీ)పై అలవోకగా గెలిచాడు. దీంతో వరుసగా రెండో  ఏడాది టైటిల్‌‌‌‌కు మరింత చేరువగా వచ్చాడు. ఈ ఏడాది కూడా అల్కరాజ్‌‌‌‌ టైటిల్‌‌‌‌ నెగ్గితే రోజర్‌‌‌‌ ఫెడరర్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌‌‌‌గా రికార్డులకెక్కుతాడు. 2004–08 మధ్య కాలంలో ఫెడరర్‌‌‌‌ వరుసగా ఐదుసార్లు టైటిల్‌‌‌‌ను నిలబెట్టుకున్నాడు. అలాగే అల్కరాజ్‌‌‌‌ నాలుగు మేజర్‌‌‌‌ టోర్నీల్లో తన రికార్డును 24–1కు పెంచుకున్నాడు. ఈ మ్యాచ్‌‌‌‌కు ఇండియా క్రికెట్‌‌‌‌ లెజెండ్‌‌‌‌ ఎం.ఎస్‌‌‌‌. ధోనీ హాజరయ్యాడు. బ్రేక్‌‌‌‌ టైమ్‌‌‌‌లో పక్కవాళ్లతో చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. కొంత మంది ఫ్యాన్స్‌‌‌‌ దీనికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్‌‌‌‌’ (ట్విటర్‌‌‌‌)లో షేర్‌‌‌‌ చేశారు. 

అర్ధగంట హోరాహోరీ

రెండున్నర గంటల మ్యాచ్‌‌‌‌లో తొలి 30 నిమిషాల్లో జ్వరెవ్‌‌‌‌ గట్టి పోటీ ఇచ్చాడు. ఇద్దరు సర్వీస్‌‌‌‌లు నిలబెట్టుకోవడంతో తొలి సెట్‌‌‌‌ ఓ దశలో 3–3తో సమమైంది. ఈ టైమ్‌‌‌‌లో బలమైన బ్యాక్‌‌‌‌హ్యాండ్‌‌‌‌ షాట్‌‌‌‌తో విరుచుకుపడిన జర్మన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ తొలి బ్రేక్‌‌‌‌ పాయింట్‌‌‌‌తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ ఈ చాన్స్‌‌‌‌ను అతను నిలబెట్టుకోలేదు. తర్వాతి గేమ్‌‌‌‌లో బేస్‌‌‌‌లైన్‌‌‌‌ ఆటతో చెలరేగిన 20 ఏళ్ల అల్కరాజ్‌‌‌‌13 పాయింట్లలో 11 నెగ్గి ఈజీగా సెట్‌‌‌‌ను సాధించాడు. తర్వాతి రెండు సెట్లలో 26 ఏళ్ల జ్వరెవ్‌‌‌‌ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాడు. 129 ఎంపీహెచ్‌‌‌‌ వేగంతో సర్వీస్‌‌‌‌ చేస్తూ, క్రాస్‌‌‌‌ కోర్టు బ్యాక్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ విన్నర్స్‌‌‌‌తో అల్కరాజ్‌‌‌‌ రెచ్చిపోయాడు. ఫలితంగా 2–1తో రెండో సెట్‌‌‌‌ను మొదలుపెట్టిన అతను వెనుదిరిగి చూసుకోలేదు. మూడో సెట్‌‌‌‌లోనూ ఇదే సీన్‌‌‌‌ రిపీట్‌‌‌‌ అయ్యింది. మ్యాచ్‌‌‌‌ మొత్తంలో అల్కరాజ్‌‌‌‌ 3 ఏస్‌‌‌‌లు, 3 డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌ చేశాడు. 6 ఏస్‌‌‌‌లు, 4 డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌ చేసిన జ్వరెవ్‌‌‌‌ ఒక్క బ్రేక్‌‌‌‌ పాయింట్‌‌‌‌ను కూడా కాపాడుకోలేకపోయాడు. వచ్చిన ఐదు బ్రేక్‌‌‌‌ పాయింట్లను కాచుకున్న అల్కరాజ్‌‌‌‌ 29 విన్నర్లతో మ్యాచ్‌‌‌‌ను సొంతం చేసుకున్నాడు. 34 అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌ చేసినా పెద్దగా ఇబ్బందిపడలేదు. జ్వరెవ్‌‌‌‌ 22 విన్నర్లు, 35 అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌ చేశాడు. మరో మ్యాచ్‌‌‌‌లో మూడోసీడ్‌‌‌‌ డానియెల్‌‌‌‌ మెద్వెదెవ్‌‌‌‌ (రష్యా) 6–4, 6–3, 6–4తో ఆండ్రీ రబ్లెవ్‌‌‌‌ (రష్యా)పై నెగ్గాడు. 

వొండ్రుసోవాకు కీస్‌‌‌‌ షాక్‌‌‌‌..

విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో అమెరికా స్టార్‌‌‌‌ మాడిసన్‌‌‌‌ కీస్‌‌‌‌.. వొండ్రుసోవాకు షాకిచ్చింది. క్వార్టర్‌‌‌‌ఫైనల్లో 17వ సీడ్‌‌‌‌ కీస్‌‌‌‌ 6-1, 6-4తో 9వ సీడ్‌‌‌‌ వొండ్రుసోవా (చెక్‌‌‌‌)ను చిత్తు చేసి సెమీస్‌‌‌‌లోకి ప్రవేశించింది. బలమైన సర్వీస్‌‌‌‌లతో ఆకట్టుకున్న కీస్‌‌‌‌ 4 ఏస్‌‌‌‌లు, 3 డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌ చేసింది. వచ్చిన మూడు బ్రేక్‌‌‌‌ పాయింట్లను కాచుకుంది. 19 విన్నర్లతో చెలరేగింది. ఇక ఒక్క బ్రేక్‌‌‌‌ పాయింట్‌‌‌‌ కూడా సాధించని వొండ్రుసోవా 5 డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌, 19 అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌తో మూల్యం చెల్లించుకుంది. మరో మ్యాచ్‌‌‌‌లో రెండోసీడ్‌‌‌‌ సబలెంక (బెలారస్‌‌‌‌) 6-1, 6-4తో క్విన్‌‌‌‌వెన్‌‌‌‌ జెంగ్‌‌‌‌ (చైనా)పై గెలిచింది. గంటా 13 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో సబలెంక మూడు ఏస్‌‌‌‌లు, మూడు డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌ చేసింది. ఏడు బ్రేక్‌‌‌‌ పాయింట్లలో మూడింటిని కాపాడుకుంది. ఒక్క బ్రేక్‌‌‌‌ పాయింట్‌‌‌‌ కూడా సాధించలేని జెంగ్‌‌‌‌ 16 అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌ చేసింది.