అమెరికాకు వ్యతిరేకంగా పోస్టులుంటే నో వీసా... ఫారిన్ స్టూడెంట్ అప్లికెంట్​లకు ట్రంప్ ఝలక్

అమెరికాకు వ్యతిరేకంగా పోస్టులుంటే నో వీసా... ఫారిన్ స్టూడెంట్ అప్లికెంట్​లకు ట్రంప్ ఝలక్
  • వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్

న్యూయార్క్: అమెరికాలో చదవాలనుకుంటున్న ఫారిన్ స్టూడెంట్లకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇచ్చారు. స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అన్ని దేశాల్లోని అమెరికన్ ఎంబసీలు, కౌన్సిలర్ సెక్షన్లకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సమాచారం ఇచ్చింది. ‘సోషల్ మీడియా వెట్టింగ్’ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించింది. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లపై అగ్రరాజ్యం నిఘా పెట్టింది. అమెరికాలోని కొన్ని యూనివర్సిటీల్లో ఆ దేశ వ్యతిరేక, హమాస్‌‌‌‌‌‌‌‌ అనుకూల భావజాలం పెరిగిపోతున్నది. 

ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ ‘సోషల్ మీడియా వెట్టింగ్’ నిర్ణయం తీసుకున్నది. అప్లికెంట్ అందజేసే సోషల్ మీడియా అకౌంట్లను అధికారులు పరిశీలిస్తారు. అమెరికాను వ్యతిరేకిస్తూ ఏమైనా పోస్టులు ఉంటే.. వెంటనే అప్లికేషన్​ను రిజెక్ట్ చేస్తారు. వారి వల్ల దేశ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతే వారికి స్టూడెంట్​ వీసాలభిస్తుంది.

షెడ్యూలింగ్ ఇంటర్వ్యూల్లో మార్పు లేదు

ఇప్పటికే షెడ్యూల్ అయిన స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను కొనసాగించవచ్చని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. బుధవారం నుంచి కొత్త ఇంటర్వ్యూలను షెడ్యూలింగ్‌‌‌‌‌‌‌‌ చేయొద్దని తెలిపారు. స్టూడెంట్లు యూనివర్సిటీల్లో ఆందోళనలు, విధ్వంసం, లేదా హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొనే ఉద్దేశంతో అమెరికాకు వస్తే వారికి వీసా ఇవ్వబోమని స్పష్టం చేశారు. కొన్ని నెలలుగా ప్రో పాలస్తీనియన్ నిరసనల్లో పాల్గొన్న స్టూడెంట్ల వీసాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరి సోషల్ మీడియా అకౌంట్​ను పరిశీలిస్తామని విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్‌‌‌‌‌‌‌‌ వివరించారు.