
- కాల్పుల విరమణకు భారత్, పాక్ను ఒప్పించాం
- లేకపోతే లక్షల సంఖ్యలో జనం చనిపోయేవారని కామెంట్
వాషింగ్టన్: కాశ్మీర్పై మధ్యవర్తిత్వానికి రెడీ అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని, ఈ విషయంలో రెండు దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ తెలిపారు. ఈమేరకు తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఆయన పేర్కొన్నారు. కాగా.. జమ్మూకాశ్మీర్ తో పాటు లద్దాఖ్ యూనియన్ టెరిటరీ భారత్ లో అంతర్భాగమని, ఆ ప్రాంతాలను భారత్ నుంచి వేరుచేయలేరని ఇండియా ముందు నుంచీ చెబుతున్నది.
కాశ్మీర్ వివాదం భారత్, పాక్ ద్వైపాక్షిక అంశమని, ఈ విషయంలో మూడో దేశం జోక్యానికి తావులేదని భారత్ ఇదివరకే ఎన్నోసార్లు స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో కాశ్మీర్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ట్రంప్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, కాల్పుల విరమణకు భారత్, పాక్ ఒప్పుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాలు సీజ్ ఫైర్ కు ఒప్పుకుని మంచి నిర్ణయానికి వచ్చాయని, రెండు దేశాలది బలమైన, దృఢమైన నాయకత్వం అని ట్రంప్ పేర్కొన్నారు.
రెండు దేశాలు చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంలో అమెరికా కీలక పాత్ర పోషించిందన్నారు. సీజ్ ఫైర్ కు ఒప్పుకునేలా చేశామని, రెండు దేశాలను దేవుడు దీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘‘భారత్, పాకిస్తాన్ ఎంతో విజ్ఞత ప్రదర్శించి సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నాయి. యుద్ధం కొనసాగి ఉంటే లక్షల సంఖ్యలో జనం చనిపోయేవారు. భారీగా విధ్వంసం జరిగేది. పరిస్థితిని అర్థం చేసుకుని కాల్పుల విరమణకు ఒప్పుకున్న భారత్, పాక్ స్థైర్యాన్ని అభినందిస్తున్నా. వెల్ డన్” అని ట్రంప్ పేర్కొన్నారు.