వాషింగ్టన్: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి తాము చేస్తున్న యుద్ధాన్ని ముగించాలని ఆలోచిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్‌పై ఇప్పటికే పైచేయి సాధించామని అన్నారు. తమ దేశంపై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడులకు ఇరాన్ భీకర ప్రతిదాడులతో స్పందిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
ఇటీవలే ఇరాన్‌లోని కీలకమైన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ అటాక్ జరిగిన కొన్ని గంటలకే ఇరాన్ కూడా ఖతార్‌లోని అతిపెద్ద ఎల్ఎన్ జీ గ్యాస్ ఫీల్డ్‌పై ప్రతిదాడి చేసింది. దీంతో అంతర్జాతీయంగా గ్యాస్, ఆయిల్ ధరలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించే ఆలోచనలో ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌లోని గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయబోదని స్పష్టం చేశారు.
- 46 వారాలు పడుతుంది: వైట్ హౌస్
తాము అనుకున్న లక్ష్యాలను సాధించి ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు 46 వారాలు పడుతుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరొలిన్ లీవిట్ ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. ‘‘ఇరాన్ తో యుద్ధం ప్రారంభమై 3 వారాలు కావస్తున్నది. మా బలగాలు అద్భుతంగా పోరాడుతున్నాయి” అని లీవిట్ చెప్పారు.
