అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(OPT) ప్రోగ్రామ్ కింద అమెరికాలో పనిచేయాలంటే ఏకంగా 70వేల డాలర్లు అంటే సుమారు రూ.70 లక్షలు ఫీజు చెల్లించాలనే కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు అధ్యక్షుడు ట్రంప్.
అసలు ఈ OPT అంటే ఏమిటి?
అమెరికా యూనివర్సిటీల్లో డిగ్రీ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు తమ చదువుకు తగిన రంగంలో పనిచేసి ప్రాక్టికల్ అనుభవం సంపాదించడానికి 'OPT' అవకాశం కల్పిస్తుంది. సాధారణంగా ఇది 12 నెలలు ఉంటుంది. అదే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ కోర్సులు చేసిన వారికైతే మరో 24 నెలల అదనపు పొడిగింపు లభిస్తుంది.
అమెరికాలో టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఫైనాన్స్ రంగాల్లో కెరీర్ ప్రారంభించాలనుకునే విదేశీ విద్యార్థులకు ఈ OPT చాలా కీలకం. దీని ద్వారానే చాలా మంది H-1B వీసాలకు లేదా ఇతర ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రేషన్ ఆప్షన్స్ వైపు అడుగులు వేస్తారు. 2024లోనే లక్షలాది మంది విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌ను ఉపయోగించుకున్నారు.
కొత్త ప్రతిపాదన ఏమిటి?
అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (DHS) విడుదల చేసిన కొత్త నిబంధన ప్రకారం.. ఎఫ్-1 వీసా విద్యార్థులకు యూనివర్సిటీలు తొలిసారి OPT సిఫార్సు చేయాలంటే 70వేల డాలర్లు చెల్లించాలి. అలాగే STEM ఎక్స్‌టెన్షన్‌లతో సహా తర్వాతి సిఫార్సులకు మరో 30వేల డాలర్లు అదనంగా కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు కేవలం 470 డాలర్లు మాత్రమే ఉండగా.. ఈ కొత్త ఫీజు దానికంటే వంద రెట్లు ఎక్కువగా ఉండటం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ డబ్బు కట్టాల్సింది ఎవరు?
సాంకేతికంగా ఈ ఫీజును విద్యార్థుల నుంచి నేరుగా కాకుండా.. విద్యార్థులను సిఫార్సు చేసే యూనివర్సిటీల నుంచి వసూలు చేస్తారు. అయితే యూనివర్సిటీలు ఈ భారాన్ని విద్యార్థుల మీదకో, కంపెనీల మీదకో మోపే అవకాశం ఉంది. ఒకవేళ యూనివర్సిటీలు ఈ ఫీజును భరించలేకపోతే ఆ భారమంతా విద్యార్థులపైనే పడుతుంది.
అమెరికాలో మోసాలను అరికట్టడం, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడం, అమెరికన్ కార్మికులను రక్షించడమే ఈ కొత్త నిబంధనల ఉద్దేశమని DHS చెబుతోంది. OPT అనేది చౌకైన విదేశీ శ్రామిక శక్తికి మార్గంగా మారుతోందని, అందుకే యూనివర్సిటీలు విద్యార్థులను సిఫార్సు చేసేటప్పుడు మరింత క్షుణ్ణంగా పరిశీలించేలా ఈ ఫీజు నిబంధన తెచ్చినట్లు వాదిస్తోంది.
భారతీయ విద్యార్థులపై ప్రభావం?
అమెరికాలో చదివే విదేశీ విద్యార్థుల్లో భారత్, చైనా దేశాల వాటా చాలా ఎక్కువ. ముఖ్యంగా మన దేశం నుంచి వెళ్లే ఇంజనీరింగ్, టెక్నాలజీ విద్యార్థులు అమెరికాలో స్థిరపడటానికి ఈ OPT తొలిమెట్టు లాంటిది. ఒకవేళ యూనివర్సిటీలు ఈ భారీ ఫీజును విద్యార్థులకు బదిలీ చేస్తే.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు అమెరికాలో ఉద్యోగం చేయడం కలగానే మిగిలిపోతుంది. అమెరికన్ యూనివర్సిటీలు, కంపెనీలు సాదాసీదా కోర్సుల కంటే, ఎక్కువ కాలం ఉండే STEM కోర్సుల విద్యార్థుల వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. దీనిపై వచ్చే స్పందనను బట్టి ట్రంప్ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ ఇది అమలైతే, అమెరికాలో చదువుకుని అక్కడే జాబ్ చేస్తూ స్థిరపడాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
