
గడచిన కొన్ని వారాలుగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా ఆంక్షలు ఉంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూఎస్ సెనెటర్ లిండ్సీ గ్రాహమ్ నోరు పారేసుకున్నారు. రష్యా నుంచి తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ కొంటున్న చైనా, ఇండియా, బ్రెజిల్ తో పాటు బ్రిక్స్ దేశాలకు హెచ్చరిక జారీ చేశారు. రష్యన్ ఆయిల్ కొనటం కొనసాగిస్తున్న దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అన్నారు.
ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన గ్రాహమ్ ఆయిల్ కొనటం ఆపకపోతే 500 శాతం వరకు భారీ సుంకాలను విధిస్తామని.. ఆయిల్ కొనే దేశాల ఆర్థిక వ్యవస్థలను తొక్కేస్తామంటూ రెచ్చిపోయారు. రష్యా నుంచి కొనుగోళ్లను నిలిపివేయటం ద్వారా ఆర్థికంగా దానిని బలహీన పరిచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి అంతం పలకాలని అమెరికా భావిస్తున్నట్లు ఆయన మాటల్లో వెల్లడైంది. ఆయిల్ కొంటున్న దేశాలు లాభపడటాన్ని బ్లడ్ మనీ అంటూ కామెంట్ చేశారు గ్రాహమ్.
ALSO READ : క్రిప్టో ఎక్స్ఛేంజీలపై హ్యాకర్ల వరుస దాడులు.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..!
రష్యాతో వ్యాపారం చేస్తూ ఆ దేశానికి ఆర్థికంగా అండగా నిలుస్తు్న్న దేశాలపై అమెరికా ప్రస్తుతం సీరియస్ గా ఉన్న తరుణంలో ఈ కామెంట్స్ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. రష్యాను ఆర్థికంగా బలహీన పరిచి ఏకాకిగా మార్చటం ద్వారా యుద్ధాన్ని ఆపాలన్నదే యూఎస్ ప్లాన్. రానున్న 50 రోజుల్లో శాంతి చర్చలకు పుతిన్ రాకపోతే రష్యా నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ కొంటున్న దేశాలపై సెకండరీ సుంకాలు 100 శాతం విధించనున్నట్లు ట్రంప్ గతవారం చెప్పారు.
పగలు తనతో ప్రశాంతంగా చర్చలు జరిపి రాత్రికి ఉక్రెయిన్ పై మిసైళ్ల వర్షం కురిపించటంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకాల ప్రాథమిక ఉద్దేశం రష్యాను చర్చలకు రప్పించటమేనని ట్రంప్ చెప్పారు. గతంలోని అమెరికా నేతలను ఫూల్స్ చేసినట్లు పుతిన్ తనను ఏమార్చలేడని ట్రంప్ అన్నారు.