ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా-ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందా?. తాజా అంతర్జాతీయ పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏప్రిల్ 9 నాటికి ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇజ్రాయెల్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించే ఉద్దేశంతో, ఇరాన్ ఎనర్జీ రిసోర్సెస్, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఏప్రిల్ 9 ఎందుకు..?
అమెరికా ఇరాన్ యుద్ధాన్ని ఏప్రిల్ 9 నాటికి ముగించడం వెనుక ఒక బలమైన కారణం ఉందంటోంది ఇజ్రాయెల్ దినపత్రిక యెడియోత్ అహరోనోత్. అదే నెలలో ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఆ దేశాన్ని సందర్శించనున్నారు. అక్కడ ఆయనకు ప్రతిష్టాత్మకమైన ఇజ్రాయెల్ ప్రైజ్ అందజేయనున్నారు. ఈ పర్యటనకు ముందే యుద్ధం ముగిస్తే.. ఒక శాంతి దూతగా ట్రంప్ అక్కడ అడుగుపెట్టే అవకాశం ఉంటుందని కథనం చెబుతోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న సుమారు 21 రోజుల సమయాన్ని అటు పోరాటానికి, ఇటు దౌత్యపరమైన చర్చలకు సమాంతరంగా వాడుకోవాలని అమెరికా భావిస్తోందట.
పాకిస్థాన్ వేదికగా చర్చలు?
మరోవైపు ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక కాబోతోందనే వార్త ప్రస్తుతం హల్‍చెల్ చేస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పీస్ మిషన్స్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ వంటి కీలక నేతలు ఇరాన్ ప్రతినిధులతో ఇస్లామాబాద్‌లో భేటీ అయ్యే అవకాశం ఉందని ఇజ్రాయెల్ వార్తా సంస్థ పేర్కొంది. అయితే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ ఖలీబాఫ్ వాటిని ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశారు. మార్కెట్లను ప్రభావితం చేయడానికే ట్రంప్ ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
వైట్ హౌస్ ఏమంటోంది?
ఈ సున్నితమైన అంశంపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ స్పందిస్తూ.. దౌత్యపరమైన చర్చలు చాలా రహస్యంగా జరుగుతున్నాయని, ప్రెస్ ద్వారా తాము చర్చలు జరపబోమని వెల్లడించారు. ఏదేమైనా అధికారికంగా ప్రకటించే వరకు ఊహాగానాలను నమ్మవద్దని ఆమె కోరారు. ఒకవైపు క్షిపణుల మోత, మరోవైపు తెరవెనుక రాయబారాలతో ఇరాన్ యుద్ధం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఏప్రిల్ 9 నాటికి వార్ పూర్తిగా ఆగిపోతుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే ఇది కార్యరూపం దాల్చే వరకూ వేచి చూడాల్సిందే అంటున్నారు నిపుణులు.
