H-1B వీసాలకు లాటరీ విధానాన్ని రద్దు చేసిన అమెరికా.. భారత టెక్కీలపై ప్రభావం ఇదే..

H-1B వీసాలకు లాటరీ విధానాన్ని రద్దు చేసిన అమెరికా.. భారత టెక్కీలపై ప్రభావం ఇదే..

అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కనే భారతీయ టెక్కీలకు ట్రంప్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న H-1B వీసా లాటరీ విధానానికి స్వస్తి పలుకుతూ.. అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అదృష్టం మీద ఆధారపడే రాండమ్ లాటరీ విధానం స్థానంలో, అభ్యర్థి నైపుణ్యం, వారికి ఆఫర్ చేసే జీతం ఆధారంగా వీసాలను కేటాయించే 'వెయిటెడ్ సెలక్షన్' పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 27, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇది FY 2027 హెచ్-1బీ క్యాప్ రిజిస్ట్రేషన్ సీజన్ నుంచి వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం ఉన్న లాటరీ విధానాన్ని చాలా సంస్థలు దుర్వినియోగం చేస్తూ.. అమెరికన్ కార్మికుల కంటే తక్కువ జీతాలకు విదేశీయులను రిక్రూట్ చేసుకుంటున్నట్లు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఆరోపిస్తోంది. కేవలం తక్కువ ఖర్చుతో కూడిన శ్రమను దిగుమతి చేసుకోవడమే లక్ష్యంగా కొందరు యజమానులు ఈ వ్యవస్థను వాడుకుంటున్నారని.. దీనివల్ల అమెరికాలోని వేతనాల స్థాయి దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త రూల్స్ ప్రకారం ఇకపై అత్యున్నత నైపుణ్యం కలిగి ఉండి, ఎక్కువ వేతనం పొందే విదేశీ నిపుణులకు వీసా లభించే అవకాశాలు దక్కుతాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు చేసే ప్రతిభావంతులను మాత్రమే యూఎస్ ఎంట్రీ పొందగలరని ట్రంప్ ప్రభుత్వం చెప్పేస్తోంది. 

భారతీయులపై హెచ్1బీ రూల్స్ మార్పుల ప్రభావం..
ఈ మార్పుల ప్రభావం భారతీయ ఐటీ రంగంపై, యువ నిపుణులపై భారీగానే ఉండనుంది. ప్రస్తుతం అమెరికా జారీ చేసే H-1B వీసాల్లో అత్యధిక శాతం భారతీయులకే దక్కుతున్నాయి. ముఖ్యంగా భారతీయ ఐటీ దిగ్గజ సంస్థలు, అవుట్‌సోర్సింగ్ కంపెనీలు తక్కువ లేదా మధ్యస్థాయి వేతనాలతో భారీగా అప్లికేషన్లు దాఖలు చేస్తుంటాయి. ఇకపై అటువంటి ఎంట్రీ లెవల్ దరఖాస్తుదారులకు వీసా రావడం కష్టతరం కానుంది. కేవలం టాప్ లెవల్ ప్యాకేజీలు పొందే సీనియర్ నిపుణులకు మాత్రమే కొత్త విధానం కింద ఎంట్రీ లభించనుంది.

ALSO READ : ఇస్రో బాహుబలి స్పెషల్

ఏఐ యుగంలో.. కొత్త రూల్స్ కింద భవిష్యత్తులో అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయ అభ్యర్థులు తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కేవలం సాధారణ కోడింగ్ స్కిల్స్ కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇతర స్పెషలైజ్డ్ విభాగాల్లో పట్టు సాధించిన వారికి మాత్రమే కొత్త వ్యవస్థలో ప్రాధాన్యత లభిస్తుంది. మెుత్తానికి ఏది ఏమైనా.. అమెరికా వీసా ప్రక్రియలో 'అదృష్టం' పోయి పూర్తిగా.. 'అర్హత'కు పెద్దపీట వేయడం భారతీయ టెక్కీలకు ఒక సవాలుతో కూడిన పరిణామంగా చెప్పుకోవచ్చు.