వెనెజువెలా ప్రెసిడెంట్కు అమెరికా సంకెళ్లు

వెనెజువెలా ప్రెసిడెంట్కు అమెరికా సంకెళ్లు
  • యూఎస్ బలగాల కస్టడీలో మదురో, ఆయన భార్య సీలియా ఫ్లోరెస్  
  • అమెరికా బాంబు దాడులతో దద్దరిల్లిన వెనెజువెలా రాజధాని కరాకస్
  • సైనిక చర్య విజయవంతమైందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 
  • అమెరికా దాడిని తీవ్రంగా ఖండించిన వెనెజువెలా.. ఎమర్జెన్సీ ప్రకటన  
  • మదురో దంపతులపై న్యూయార్క్​లో నార్కో టెర్రరిజం అభియోగాలు

వాషింగ్టన్ / కరాకస్: దక్షిణ అమెరికాలోని వెనెజువెలాపై అమెరికా భీకర వైమానిక దాడులు చేసింది. శనివారం తెల్లవారుజామున 2 గంటలకు వెనెజువెలా రాజధాని కరాకస్​పై అమెరికన్ బలగాలు అరగంటపాటు బాంబులతో విరుచుకుపడ్డాయి. ఆ వెంటనే హెలికాప్టర్ ద్వారా డెల్టా ఫోర్స్ కమెండోలు ప్రెసిడెంట్ నికోలస్ మదురో అధ్యక్ష భవనంలోకి చొరబడ్డారు. 

మదురోను, ఆయన భార్య సీలియా ఫ్లోరెస్​ను కస్టడీలోకి తీసుకుని, ఆ దేశం నుంచి వెలుపలికి తరలించారు. అనంతరం.. వెనెజువెలాలో సైనిక చర్య విజయవంతంగా పూర్తయిందని తెల్లవారుజామున 4.30 గంటలకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మదురో దంపతులను తమ బలగాలు నిర్బంధించి, ఆ దేశం నుంచి తరలించాయని తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా వెల్లడించారు.  పూర్తి వివరాలను ఫ్లోరిడాలోని తన మార్ ఏ లాగో వద్ద ఉదయం 11 గంటలకు మీడియాకు వెల్లడిస్తానని ఆ పోస్టులో ఆయన పేర్కొన్నారు.

కాగా, అమెరికా బలగాలు జరిపిన బాంబు దాడులతో వెనెజువెలా రాజధాని కరాకస్ దద్దరిల్లింది. మిలిటరీ బేస్ లు, జనావాసాల్లో జరిగిన బాంబు పేలుళ్లతో రాత్రిపూట పెద్ద ఎత్తున వెలుతురు, పొగలు, శబ్దాలు వెలువడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

కొన్నిచోట్ల కరెంట్ సప్లై నిలిచిపోయి, చీకట్లు అలముకున్నాయి. అయితే, ఈ దాడుల్లో ఎంతమంది చనిపోయారు, గాయపడ్డ వాళ్లు ఎంతమందనే వివరాలు వెల్లడి కాలేదు. ఈ దాడులకు ముందు వెనెజువెలా గగనతలాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటిస్తూ ఎయిర్ లైన్స్ సంస్థలకు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరికలు జారీ చేసింది. మదురో చివరిసారిగా శుక్రవారం కరాకస్ లో చైనా ప్రతినిధులతో సమావేశం సందర్భంగా ప్రభుత్వ టీవీలో కనిపించారు.

కొన్ని నెలలుగా హెచ్చరిస్తూ.. అటాక్ 
వెనెజువెలా నుంచి డ్రగ్ కార్టెల్స్ ద్వారా అమెరికాలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, ఇందులో మదురో పాత్ర కూడా ఉందని ట్రంప్ కొన్ని నెలలుగా ఆరోపిస్తూ వచ్చారు. వెనెజువెలా నుంచి అమెరికాకు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారంటూ పలు పడవలపై బాంబు దాడులు కూడా చేయించారు. 

మదురో గద్దె దిగిపోవాలని, లేకుంటే సైనిక చర్య తప్పదని పదే పదే హెచ్చరించారు. మదురోను పట్టుకునేందుకు సహకరించే వాళ్లకు రూ.450 కోట్ల రివార్డ్ ఇస్తామని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం ఏకంగా సైనిక చర్యతో మదురో దంపతులను నిర్బంధించి తీసుకెళ్లడం సంచలనంగా మారింది.

అధ్యక్ష భవనం పైనే ల్యాండింగ్​..
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి దేశం నుంచి తరలించడంలో అమెరికా రహస్య దళం డెల్టా ఫోర్స్​ విజయవంతమైంది. దీంతో ఈ ఫోర్స్​ పేరు ప్రపంచవ్యాప్తంగా మరోసారి మార్మోగుతున్నది. అమెరికా సైన్యంలో దీన్ని అధికారంగా ‘ఫస్ట్‌‌ స్పెషల్​ ఫోర్సెస్ ఆపరేషనల్‌‌ డిటాచ్‌‌మెంట్‌‌ డెల్టా’ అని పిలుస్తారు.  ప్రపంచానికి ఇది ‘డెల్టా ఫోర్స్’గానే తెలుసు. అత్యంత క్లిష్టమైన, అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్లను మాత్రమే ఈ దళం నిర్వహిస్తుంది. దీన్ని 1977లో కల్నల్ చార్లెస్ బెక్విత్ స్థాపించారు. బ్రిటిష్ ఎయిర్‌‌‌‌ సర్వీస్‌‌ అయిన ఎస్‌‌ఏఎస్‌‌ నమూనాలో దీని శిక్షణ, వ్యూహాలు ఉంటాయి. 

నార్త్‌‌ కరోలినాలోని ఫోర్ట్‌‌బ్రాగ్‌‌ స్థావరంగా ఇది పనిచేస్తుంది. సీఏజీ, ఏసీఈ అనే సీక్రెట్​పేర్లతో కీలకమైన ఆపరేషన్లు నిర్వహిస్తుంది. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, బందీల విముక్తి,  ప్రత్యేక నిఘా, వీవీఐపీల  రక్షణకు ఈ డెల్టా ఫోర్స్‌‌ను వాడుతారు. ఇందులో నాలుగు ప్రధాన స్క్వాడ్రన్లు ఉంటాయి. ప్రతి స్క్వాడ్రన్ తిరిగి మూడు ట్రూపులుగా విభజించారు. ఇందులో సెలెక్షన్‌‌ ప్రాసెస్‌‌ అత్యంత కఠినంగా ఉంటుంది. 

ఆర్మీలోని ‘గ్రీన్ బెరెట్స్’ లేదా ‘రేంజర్ రెజిమెంట్’నుంచి మాత్రమే సమర్థులైన సైనికులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు 45 పౌండ్ల బరువుతో సుమారు 40 మైళ్ల దూరం అత్యంత కఠినమైన భూభాగాల్లో నడవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి 6 నెలల పాటు ‘ఆపరేటర్ ట్రైనింగ్ కోర్స్’ ఇస్తారు. 

బస్సు డ్రైవర్‌‌‌‌ నుంచి.. 
కారకాస్‌‌లో 1962లో పుట్టిన నికోలస్‌‌ మదురో మోరోస్‌‌ బస్సు డ్రైవర్‌‌‌‌గా తన కెరీర్‌‌‌‌  ప్రారంభించా రు. అప్పుడే కార్మిక సంఘం లీడర్​గా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. 1990లో వెనెజువెలా ప్రెసిడెంట్‌‌ హ్యూగో చావెజ్‌‌తో దగ్గరి సంబంధా లు ఏర్పరచుకున్నారు. 1992లో సైనిక తిరుగుబాటు తర్వాత చావెజ్‌‌ అరెస్ట్​ కాగా.. ఆయన విడుదల కోసం మదురో మొదలుపెట్టిన ఉద్యమం.. చావెజ్‌‌ను అధ్యక్షుడిని చేసింది. 

1999లో మదురో రాజ్యాంగ సభకు ఎన్నికై పార్లమెంట్‌‌ స్పీకర్‌‌‌‌గా, ఆపై విదేశాంగ మంత్రిగా పనిచేశారు. అప్పటికే కేన్సర్‌‌‌‌తో పోరాడుతున్న చావెజ్‌‌.. తన రాజకీయ వారసుడిగా మదురోను ప్రకటించి కన్నుమూశారు. 2013లో మదురో వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా, ఆపై ఎన్నికల్లో ప్రెసిడెంట్‌‌గా గెలుపొంది బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనే ప్రెసిడెంట్‌‌గా కొనసాగుతున్నారు.

వెనెజువెలా వైస్​ ప్రెసిడెంట్​ మండిపాటు 
అమెరికా దాడులను వెనెజువెలా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అవి తమ భూభాగంపై జరిగిన ‘సామ్రాజ్యవాద దాడులు’ అని మండిపడింది. అమెరికన్ యుద్ధ విమానాలు ఏడు చోట్ల బాంబు దాడులు చేశాయని వెల్లడించింది. కరాకస్ తోపాటు మిరండా, అరాగ్వా, లా గ్వైరా స్టేట్స్ లోనూ దాడులు జరిగాయని తెలిపింది. ఈ దాడులను ఖండిస్తూ దేశ ప్రజలంతా వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చింది. 

అమెరికా దాడుల నేపథ్యంలో ప్రెసిడెంట్ మదురో దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారని పేర్కొంది. మదురో దంపతులు ఎక్కడున్నారో తెలియడంలేదని, వాళ్లు ప్రాణాలతోనే ఉన్నారనేందుకు ఆధారాలు చూపాలని అమెరికాను వెనెజువెలా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగజ్ డిమాండ్ చేశారు. కాగా, వెనెజువెలా చట్టాల ప్రకారం.. ప్రెసిడెంట్ అందుబాటులో లేకపోతే దేశ పాలనా బాధ్యతలు తక్షణమే వైస్ ప్రెసిడెంట్ చేతికి వెళతాయి.

గుడిసెలో పుట్టి పెరిగి ఫస్ట్‌‌ లేడీగా..
ప్రస్తుత వెనెజువెలా ఫస్ట్‌‌ లేడీ సీలియా ఫ్లోరెస్..1956లో టినాక్విల్లో అనే మారుమూల గ్రామంలోని గుడిసెలో పుట్టి పెరిగారు. లా చదివి పోలీస్‌‌ స్టేషన్‌‌లో పార్ట్‌‌టైం పనిచేస్తూ ఓ పోలీస్‌‌ను పెండ్లి చేసుకున్నారు. ఆపై ఓ ప్రైవేట్ కంపెనీలో డిఫెన్స్‌‌ అటార్నీగా పనిచేశారు. ప్రెసిడెంట్‌‌ హ్యూగో చావెజ్‌‌ జైల్లో ఉన్నప్పుడు ఆయనకు లీగల్‌‌పరంగా సాయం చేసేందుకు ప్లోరెస్ ముందుకొచ్చారు. 

ఈ క్రమంలోనే నికోలస్‌‌ మదురోతో ఫ్లోరెస్​కు పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరూ వారివారి భాగస్వాములకు విడాకులు ఇచ్చి 2013లో ఫ్లోరెస్, మదురో ఒక్కటయ్యారు. అంతకుముందు 2000 సంవత్సరంలో సిలియా ఫ్లోరెస్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికై, 2007నాటికి పార్లమెంట్‌‌ నాయకురాలిగా ఎదిగారు. 2012లో అటార్నీ జనరల్‌‌ అయ్యారు.