నేషనల్ గార్డ్స్‌పై దాడి.. ఆఫ్గన్లకు ఇమ్మిగ్రేషన్ సేవలు నిలిపేసిన అమెరికా..

నేషనల్ గార్డ్స్‌పై దాడి.. ఆఫ్గన్లకు ఇమ్మిగ్రేషన్ సేవలు నిలిపేసిన అమెరికా..

అమెరికా వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్‌కి అత్యంత సమీపంలో పట్టపగలు ఆఫ్గన్ జాతీయుడు నేషనల్ గార్డ్స్ సిబ్బందిపై దాడి చేసిన ఘటన అందరినీ షాక్ కి గురిచేసింది. దీంతో భద్రతా సిబ్బందిలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడైంది. నిందితుడు రహమనుల్లా లకన్వాల్ ను పట్టుకున్నారు అధికారులు. ఈ వ్యక్తి ఆఫ్గనిస్తాన్ లో అమెరికా దళాలతో పాటు సీఐఏతో కూడా కలిసి పనిచేసినట్లు వెల్లడైంది. అయితే తాజా దాడిపై అధ్యక్షుడు ట్రంప్ చాలా తీవ్రంగా స్పందించారు.

ఈ సంఘటన దేశంలో ఎన్నికల అనంతరం భద్రతా వాతావరణాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టింది. దీంతో అఫ్గన్ శరణార్థుల ప్రవేశంపై అన్ని ప్రక్రియలు నిలిపివేసింది అమెరికా. దీంతో మరోసారి యూఎస్ ఇమ్మిగ్రేషన్ విధానాలపై వివాదం రాజుకుంది. ఇతర దేశాల నుంచి అమెరికాలోకి ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎంట్రీకి అనుమతించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

ఆఫ్గన్ పౌరుడు చేసిన దాడిలో ఎలిజా రామిరెజ్, మార్కస్ హేల్ అనే భద్రతా సిబ్బంది అప్పటికీ క్రిటికల్ స్థితిలో చికిత్స పొందుతున్నారు. హోం ల్యాండ్ సెక్యూరిటీ విచారణ జరుపుతున్నప్పటికీ దాడికి స్పష్టమైన కారణాలను బయటపెట్టట్లేదు. అయితే ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా లకన్వాల్ ఒక 9 మిమీ గ్లాక్ పిస్టల్ ఉపయోగించాడని తేలింది. నిందితుడి వాహనంలో అఫ్గనిస్తాన్‌లో అమెరికా జోక్యంపై తీవ్ర విమర్శలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ దాడి థాంక్స్ గివింగ్ రోజు ఉదయం జరగటం అమెరికన్లను బాధకు గురిచేసింది. 

తాజా దాడితో అమెరికా పౌరసత్వం ఇమ్మిగ్రేషన్ సేవలు (USCIS) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆఫ్గన్ పౌరులకు వెంటనే అన్ని సేవలను నిలిపేస్తున్నట్లు పేర్కొంది. భద్రత, పరిశీలన ప్రోటోకాల్‌లపై తదుపరి సమీక్ష పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది. 2021లో తాలిబన్ స్వాధీనం తర్వాత అమెరికాకు వచ్చిన అఫ్గన్ వలసదారులపై ట్రంప్ సర్కార్ పర్యవేక్షణ పెంపు ప్రకటన హామీకి అనుగుణంగా తాజా చర్యలు ఉన్నట్లు తెలుస్తోంది.