
- దేశీయ వినియోగంతో వృద్ధికి మద్దతు
- క్రిసిల్ ఇంటెలిజెన్స్ వెల్లడి
న్యూఢిల్లీ: భారతీయ వస్తువులపై యునైటెడ్ స్టేట్స్ విధించిన అధిక టారిఫ్‌లు దేశ వృద్ధికి ప్రధాన రిస్క్‌గా మారతాయని క్రిసిల్ ఇంటెలిజెన్స్ తన సెప్టెంబర్ రిపోర్ట్‌లో తెలిపింది. ఈ టారిఫ్‌లు భారతీయ వస్తువుల ఎగుమతులు, పెట్టుబడులు.. రెండింటిపై ప్రభావం చూపుతాయని అంచనా వేసింది. తక్కువ ద్రవ్యోల్బణం, రేట్ల కోత ద్వారా నడిచే దేశీయ వినియోగం వృద్ధికి మద్దతు ఇస్తాయని క్రిసిల్ పేర్కొంది. 2025–-26 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి గత సంవత్సరం ఇదే క్వార్టర్లో 7.4 శాతం నుంచి పెరిగి, ఐదు క్వార్టర్లలో అత్యధికంగా 7.8 శాతానికి చేరింది.
నామినల్ జీడీపీ వృద్ధి ఇదే కాలంలో 10.8 శాతం నుంచి 8.8 శాతానికి నెమ్మదించింది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం గత ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతం నుంచి ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.5 శాతానికి తగ్గే అవకాశం ఉందని రిపోర్ట్ తెలిపింది. భారీ సాగు దిగుబడులు ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతుందని అంచనా.
అయితే, అధిక వర్షపాతం ప్రభావాన్ని ఇంకా పూర్తిగా అంచనా వేయలేదు. తక్కువ ముడి చమురు ధరలు, అనుకూలమైన అంతర్జాతీయ కమోడిటీ ధరలు ఆహారేతర ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే అవకాశం ఉంది. ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో మరోసారి రేట్లను తగ్గించే అవకాశం ఉందని రిపోర్ట్ పేర్కొంది.