రష్యా దూకుడు తగ్గించేందుకే భారత్‌‌పై అధిక టారిఫ్‌‌లు ... అమెరికా వైస్ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు

రష్యా దూకుడు తగ్గించేందుకే భారత్‌‌పై అధిక టారిఫ్‌‌లు ... అమెరికా వైస్ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు
  • ఉక్రెయిన్‌‌పై యుద్ధం ఆపేలా రష్యా ఆర్థిక మూలాలు దెబ్బతీయడమే మా లక్ష్యం
  • రష్యా–ఉక్రెయిన్​ యుద్ధాన్ని ట్రంప్​ ఆపేస్తారని కామెంట్​

వాషింగ్టన్: భారత్‌‌పై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌‌లపై ఆ దేశ వైస్​ప్రెసిడెంట్​ జేడీ వాన్స్​ స్పందించారు. రష్యా దూకుడును అదుపు చేసేందుకు ట్రంప్‌‌ సర్కారు చాలా చర్యలు తీసుకున్నదని వెల్లడించారు. ఇందులో భాగంగానే భారత్‌‌పై సెకండరీ టారిఫ్‌‌లు విధించిందని తెలిపారు.  ఎన్‌‌బీసీ న్యూస్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ వాన్స్​ఈ వ్యాఖ్యలు చేశారు. 

రష్యా ఆర్థిక మూలాలను అడ్డుకొని, ఉక్రెయిన్‌‌పై దాడులను ఆపేందుకే ట్రంప్ భారత్‌‌పై సెకండరీ టారిఫ్‌‌లు విధించారని చెప్పారు.  అలాస్కా‌‌లో అమెరికా, రష్యా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఈ నెల జరిగిన భేటీలో ఎలాంటి నిర్ణయం వెలువడకున్నా.. రష్యా–-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో అమెరికా కీలక పోత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రష్యాపై ట్రంప్​ బలమైన ఒత్తిడి తెచ్చారు

రష్యన్లకు చమురు ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చే ఆదాయాన్ని అడ్డుకోడానికి ట్రంప్ టారిఫ్‌‌ అస్త్రాన్ని ప్రయోగించారని జేడీ వాన్స్​ వెల్లడించారు. ‘‘బాంబు దాడులను నిలిపివేసేందుకు రష్యా ఒప్పుకునేలా ట్రంప్ ఆర్థిక ఒత్తిడి విధానాన్ని అవలంబించారు. భారత్‌‌‌‌పై అధిక సుంకాలను విధించడం ఇందులో భాగమే’’ అని తెలిపారు. దీంతో నిధులు ప్రవాహం ఆగి ఉక్రెయిన్‌‌పై యుద్ధాన్ని కొనసాగించకుండా రష్యాను ఆపడమే అమెరికా ప్రధాన లక్ష్యమని తెలిపారు.

 భారత్‌‌పై అదనపు టారిఫ్‌‌లు విధించడం ద్వారా రష్యాపై ట్రంప్ బలమైన ఆర్థిక ఒత్తిడిని తీసుకొచ్చారని చెప్పారు. ఉక్రెయిన్‌‌లో మారణహోమాన్ని ఆపేస్తే రష్యా మళ్లీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చేరవచ్చని, కానీ యుద్ధాన్ని ఆపకుంటే ఆ దేశం ఒంటరిగా ఉండాల్సిదేనని ట్రంప్​బలమైన సందేశం ఇచ్చారని తెలిపారు.