రెచ్చగొడితే దీటుగా స్పందిస్తమన్న చైనా 

రెచ్చగొడితే దీటుగా స్పందిస్తమన్న చైనా 
  • తైవాన్ జలసంధిలోకి అమెరికా యుద్ధనౌకలు
  • స్వేచ్ఛాయుత వాతావరణం కోసమేనన్న యూఎస్​
  • రెచ్చగొడితే దీటుగా స్పందిస్తమన్న చైనా 

వాషింగ్టన్: అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు ఆదివారం తైవాన్ జలసంధి గుండా వెళ్లాయి. ఇండో‌‌‌‌‌‌‌‌–పసిఫిక్​ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణం కోసమే తమ యుద్ధ నౌకలు తైవాన్​ జలసంధి ద్వారా ప్రయాణించాయని అమెరికా ఓ ప్రకటనలో తెలిపింది. యూఎస్ఎస్​ ఆంటియోటమ్, యూఎస్ఎస్​ చాన్స్ లర్స్​విల్లే అనే యుద్ధ నౌకలు తైవాన్​ జలసంధి ద్వారా వెళ్లాయని పేర్కొంది. ఆ నౌకలు ప్రయాణించిన ప్రాంతం ఏ దేశ సముద్ర జలాల పరిధిలోకి రావని అమెరికా చెప్పుకొన్నది. తైవాన్​లో పెలోసీ పర్యటనను సాకుగా చూపుతూ తైవాన్​జలసంధిలో చైనా మిలటరీ డ్రిల్స్​చేసి ఆ ప్రాంతంలో శాంతికి భంగం కలిగించిందని, చైనా అలా మిలటరీ డ్రిల్స్​చేస్తూ శాంతికి విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని అమెరికా తేల్చిచెప్పింది. అమెరికా నౌకలు తమ జలసంధిలో ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్లాయని తైవాన్​  తెలిపింది.  

యూఎస్ నేవీ కదలికలను గమనిస్తున్నాం: చైనా

తైవాన్​జలసంధి గుండా వెళ్లిన అమెరికా యుద్ధ నౌకలను గమనిస్తున్నామని చైనా తెలిపింది. అమెరికా తీరుతో అలర్ట్​ అయ్యామని, తమను రెచ్చగొడితే దీటుగా స్పందిస్తామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. 

చైనా తీరుపై ఇండియా ఆందోళన

తైవాన్​ జలసంధిలో చైనా మిలటరీ డ్రిల్స్​ చేయడంపై ఇండియా మొదటిసారిగా ఆందోళన వ్యక్తం చేసింది. జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది. ఈ మేరకు శ్రీలంకలో భారత హై కమిషన్​ ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల ఆరంభంలో కూడా చైనా తీరుపై మన విదేశాంగ శాఖ  ఆందోళన వ్యక్తం చేసింది.