ఉలిక్కి పడ్డ పారిశ్రామిక వాడ..పాశమైలారం ఘటనతో కార్మిక కుటుంబాల్లో విషాదం

ఉలిక్కి పడ్డ పారిశ్రామిక వాడ..పాశమైలారం ఘటనతో కార్మిక కుటుంబాల్లో విషాదం
  • ఉపాధి కోసం వస్తే ప్రాణాలు పోతున్నయ్​
  • పరిశ్రమల్లో వరుస ఘటనలతో బెంబేలు

సంగారెడ్డి/పటాన్​చెరు, వెలుగు: రసాయన పరిశ్రమల్లో జరుగుతున్న పేలుడు ఘటనలు కార్మిక కుటుంబాలను ఛిద్రం చేస్తున్నాయి. మినీ ఇండియాగా పేరొందిన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ఇండ్రస్ట్రియల్​ఏరియా పాశమైలారం సిగాచి కెమికల్​ ఫ్యాక్టరీ పేలుడు ఘటనతో ఒక్క సారిగా ఉలిక్కి పడింది. ఉపాధి కోసం వస్తున్న కార్మిక కుటుంబాలు చెల్లా చెదురై దిక్కు తోచని స్థితిలో పడ్డాయి. జిల్లాలో రసాయన పరిశ్రమల్లో తరచూ రియాక్టర్లు పేలుతూ పెను ప్రమాదాలు సృష్టిస్తున్నాయి.  జిల్లాలోని పటాన్​చెరు, పాశమైలారం, హత్నూర, జిన్నారం, గుమ్మడిదల ప్రాంతాలు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాయి.

దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా కార్మికులు ఇక్కడకు వలస వచ్చి చాలీ చాలనీ వేతనాలతో బతుకునీడుస్తున్నారు. ఈ క్రమంలో పరిశ్రమల యాజమాన్యాలు కనీస భద్రతా చర్యలు చేపట్టక అనుకోని సంఘటనలతో  కార్మికులు చాలా మంది తమ ప్రాణాలను పోగొట్టుకుంటుండగా మరి కొందరు క్షతగాత్రులై దిక్కుతోచని పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా సోమవారం పాశమైలారం సిగాచి రసాయన  పరిశ్రమలో జరిగిన పేలుడు కారణంగా 13 మంది కార్మికులు మృతిచెందగా, 34 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. కార్మికుల రక్షణ కోసం ఉన్న చట్టాలను సరిగా అమలు చేసేందుకు పారిశ్రామిక యాజమాన్యాలు కృషి చేయాలని కార్మిక కుటుంబాలు కోరుతున్నాయి.

ప్రమాదాలు నిత్యకృత్యాలు

 పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన సంగారెడ్డి జిల్లాలో రసాయన పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గతేడాది ఏప్రిల్​లో హత్నూర మండలం చందాపూర్​ లోని ఎస్​బీ ఆర్గానిక్స్​ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో డైరెక్టర్​తో సహా ఐదుగురు కార్మికులు మృతి చెందారు. మరుసటి రోజు శిథిలాలలో మరో కార్మికుడి డెడ్ బాడీ లభ్య మైంది. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగి రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.  గతేడాది ఫిబ్రవరిలో  పాశమైలారంలోని  ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరగ్గా ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.  గతంలో మైలాన్ పరిశ్రమలో రసాయన డ్రమ్ములు పేలి ముగ్గురు కార్మికులు చనిపోయారు. 

జిన్నారం మండలం గడ్డపోతారంలోని లీ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలుడు  సంభవించి షిఫ్ట్ ఆపరేటర్ కు గాయాలయ్యాయి.  కార్మికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై బయటికి పరుగులు తీశారు. ఐడీఏ బొల్లారం మున్సిపల్ పరిధిలోని శ్రీకర ఆర్గానిక్స్ ఫార్మా ఫ్యాక్టరీలో బ్రాయిలర్ లో మెటీరియల్ వేస్తుండగా మంటలు అంటుకొని ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఎండాకాలంలో గడ్డపోతారం ఇండస్ట్రియల్​ ఏరియాలోని వర్ధమాన్ కెమికల్స్ కంపెనీలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. హత్నూర మండలం గుండ్ల మాచనూర్ శివారులో గల అరబిందో యూనిట్ 9 ఫ్యాక్టరీలో పొగ, మంటలు ఎగిసిపడి కార్మికులు, గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. ఏటా అనేక చోట్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 

ప్రమాదాలకు గల కారణాలు..

కెమికల్​ ఫ్యాక్టరీల్లో  ప్రమాదాలకు కారణాలుగా కొన్నింటిని అధికారులు గుర్తించారు. గ్యాస్, బయో ఫ్యూయల్​ ఆధారిత ఫ్యాక్టరీల్లో గ్యాస్ చాంబర్, రియాక్టర్లు, కెమికల్​వేస్టేజ్, విషవాయువులు నిండి రియాక్టర్లు పేలుతున్నాయి. గ్యాస్ లీక్ అవడం, షార్ట్​ సర్క్యూట్స్ వంటి ఘటనలు రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నాయి. కెమికల్ ఫ్యాక్టరీల్లో పని చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అన్​స్కిల్డ్ లేబర్‌‌‌‌తో పని చేయించుకుంటున్నారు. వీరికి సరైన అవగాహన లేక ప్రమాదాలకు కారణమవుతున్నారు.  ట్రైనింగ్​ పొందిన కార్మికులను కాకుండా స్కిల్​ లేని వారితో ప్రమాద స్థలాల్లో పని చేయించుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.