
ముంబై: బ్యాంక్ స్టాక్స్లో ప్రాఫిట్‌బుకింగ్ కారణంగా స్టాక్ మార్కెట్లు నాలుగు రోజుల ర్యాలీ తర్వాత సోమవారం (జులై 01) నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 452.44 పాయింట్లు తగ్గి 83,606.46 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 576.77 పాయింట్లు పడిపోయి 83,482.13 వద్దకు చేరుకుంది. 50- షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 120.75 పాయింట్లు క్షీణించి 25,517.05 వద్దకు చేరుకుంది.
సెన్సెక్స్ కంపెనీలలో యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎక్కువగా నష్టపోయాయి. ట్రెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్, టైటాన్ బజాజ్ ఫిన్‌సర్వ్ లాభపడ్డాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ గేజ్ 0.81 శాతం పెరిగింది.
మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.67 శాతం పెరిగింది. బీఎస్ఈ సెక్టోరల్ సూచీలలో, రియాల్టీ 0.87 శాతం, బ్యాంకెక్స్ 0.59 శాతం, ఆటో 0.49 శాతం, మెటల్ 0.49 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.19 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.17 శాతం పడిపోయాయి. క్యాపిటల్గూడ్స్ 1.10 శాతం, సేవలు 1.08 శాతం, ఇండస్ట్రియల్ 0.66 శాతం, ఆరోగ్య సంరక్షణ 0.56 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.42 శాతం పెరిగాయి.
"గత వారం గ్లోబల్ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలు, దేశీయ సంస్థల కొనుగోళ్ల నేపథ్యంలో మార్కెట్ బాగా పెరిగింది. ఇప్పుడు ప్రాఫిట్బుకింగ్మొదలవడంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టపోయాయి. గడువు తేదీ దగ్గర పడుతున్నందున భారతదేశం అమెరికాతో ఇంకా ఒప్పందాన్ని ముగించకపోవడంతో, పెట్టుబడిదారులలో అనిశ్చితిని సృష్టించే అవకాశం ఉన్నది. అమెరికా ప్రభుత్వంతో సుంకాల పరిష్కారంపై దృష్టి ఉంటుంది. అస్థిరత కొనసాగినప్పటికీ, భారతదేశానికి బలమైన వృద్ధి అవకాశాలు ఉండటం వల్ల నష్టాలు తగ్గవచ్చు’’ అని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ ఎనలిస్టు ప్రశాంత్ తాప్సే అన్నారు.
నాలుగు రోజులు భారీ లాభాలు
గత నాలుగు ట్రేడింగ్ రోజుల్లో, సెన్సెక్స్ 2,162.11 పాయింట్లు (2.64 శాతం) పెరిగింది. నిఫ్టీ 665.9 పాయింట్లు (2.66 శాతం) పెరిగింది. "మిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతలు తగ్గడం, యూఎస్వాణిజ్య ఒప్పంద ఆశల కారణంగా ప్రపంచ మార్కెట్ సెంటిమెంట్ ఈక్విటీలకు అనుకూలంగా కదులుతోంది. అయితే, ఇటీవలి ర్యాలీ తర్వాత ప్రధాన దేశీయ సూచీల్లో ప్రాఫిట్‌బుకింగ్ ఉంది.
పెట్టుబడిదారులు ఇప్పుడు క్వార్టర్లీ ఆదాయాలపై దృష్టి సారించారు’’ అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ పరిశోధనా విభాగాధిపతి వినోద్ నాయర్ అన్నారు. ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225, ఇండెక్స్ షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్ సానుకూలంగా స్థిరపడగా, హాంకాంగ్ హాంగ్ సెంగ్ నష్టపోయింది. యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
యూఎస్మార్కెట్లు శుక్రవారం లాభపడ్డాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) శుక్రవారం రూ.1,397.02 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారని ఎక్స్ఛేంజ్ డేటా తెలిపింది. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.15 శాతం తగ్గి బ్యారెల్ ధర 67.67 డాలర్లకు చేరుకుంది. సెన్సెక్స్ శుక్రవారం 303.03 పాయింట్లు (0.36 శాతం) పెరిగి 84,000 స్థాయిని తిరిగి పొంది 84,058.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 88.80 పాయింట్లు (0.35 శాతం) పెరిగి 25,637.80 వద్ద ముగిసింది.