ఫిఫా వరల్డ్‌‌ కప్‌‌ నుంచి అమెరికా ఔట్‌‌

ఫిఫా వరల్డ్‌‌ కప్‌‌ నుంచి అమెరికా ఔట్‌‌

ఫిఫా వరల్డ్‌‌ కప్‌‌ నుంచి  అమెరికా ఔట్‌‌
మెక్సికో:   భారీ అంచనాలతో ఫిఫా ప్రపంచకప్‌‌-2026 బరిలోకి దిగిన   అమెరికా జట్టుకు నిరాశ ఎదురైంది. ప్రీక్వార్టర్‌‌ ఫైనల్‌‌ మ్యాచ్‌‌లో బెల్జియం చేతిలో 4– -1 తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న బెల్జియం క్వార్టర్‌‌ ఫైనల్‌‌కు చేరుకుంది. తదుపరి దశలో ఆ జట్టు స్పెయిన్‌‌తో తలపడనుంది. మ్యాచ్‌‌ ఆరంభం నుంచే బెల్జియం దూకుడుగా ఆడింది. 9వ నిమిషంలో చార్లెస్‌‌ డి కెటెలారే గోల్‌‌ చేసి బెల్జియంకు ఆధిక్యం అందించాడు. అయితే 31వ నిమిషంలో మాలిక్‌‌ టిల్‌‌మన్‌‌ ఫ్రీకిక్‌‌ ద్వారా గోల్‌‌ చేసి అమెరికాను సమం చేశాడు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే డి కెటెలారే మరోసారి గోల్‌‌ చేసి బెల్జియంను 2-1 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.  రెండో అర్ధభాగంలోనూ బెల్జియం ఆధిపత్యం కొనసాగించింది. 57వ నిమిషంలో అమెరికా గోల్‌‌కీపర్‌‌ మ్యాట్‌‌ ఫ్రీస్‌‌ చేసిన తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్న హాన్స్‌‌ వానాకెన్‌‌ మూడో గోల్‌‌ కొట్టాడు.  అదనపు సమయంలో స్టార్‌‌ ఆటగాడు రొమేలు లుకాకు మరో గోల్‌‌ సాధించడంతో బెల్జియం 4–-1తో విజయాన్ని ఖాయం చేసుకుంది.    

ఈ మ్యాచ్​లో  అమెరికా స్టార్‌‌ ఆటగాడు ఫోలారిన్‌‌ బలోగ మైదానంలోకి దిగినా జట్టుకు పెద్దగా ఉపయోగపడలేకపోయాడు. అమెరికా ఓటమిపై కోచ్‌‌ మారిసియో పోచెట్టినో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్‌‌ సమయంలో ఆగ్రహంతో బెంచ్‌‌ వద్ద ఉన్న ర్యాక్‌‌ను తన్నడంతో వాటర్‌‌ బాటిళ్లు ఎగిరిపడ్డాయి. భారీ అంచనాలతో టోర్నీలోకి అడుగుపెట్టిన అమెరికా అభిమానులకు చివరికి నిరాశే మిగిలింది. మరోవైపు బెల్జియం మాత్రం ఆత్మవిశ్వాసంతో క్వార్టర్‌‌ ఫైనల్‌‌ పోరుకు సిద్ధమవుతోంది.